Share News

USA: అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారత సంతతి విద్యార్థిని అరెస్టు!

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:14 PM

అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నిరసనల్లో పాలుపంచుకున్న భారత సంతతి విద్యార్థిని అచింత్యా శివలింగాన్ని పోలీసులు అరెస్టు చేశారు.

USA: అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారత సంతతి విద్యార్థిని అరెస్టు!
Achinthya Sivalingam

ఎన్నారై డెస్క్: అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పాలస్తీనా అనుకూల నిరసనలతో (Pro Palestine Protests) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ (Princeton University) నిరసనల్లో పాలుపంచుకున్న భారత సంతతి విద్యార్థిని (NRI) అచింత్యా శివలింగాన్ని (Achinthya Sivalingam arrest) పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, క్యాంపస్ పరిసరాల్లో నిరసనల్లో పాల్గొన్నందుకు యూనివర్సిటీ వర్గాలు అచింత్యాతో పాటు మరో విద్యార్థిపై కూడా నిషేధం విధించాయి. అచింత్య తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ఆమె బాల్యం ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్‌లో గడిచింది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా అనేక మంది విద్యార్థులు వివిధ అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ వర్గాల కథనం ప్రకారం, మంగళవారం కొందరు విద్యార్థులు యూనివర్సిటీ‌లోని మెక్‌కాష్ కోర్ట్‌యార్డ్‌లో ఓ టెంట్ వేసుకుని నిరసన ప్రారంభించారు. ఆ తరువాత నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అరెస్టయ్యారు. అనంతరం, టెంట్‌ను తొలగించిన విద్యార్థులు అక్కడే కూర్చుని తమ నిరసన తెలిపారు. తొలుత 110 మంది నిరసన కార్యక్రమంలో పాల్గొనగా గురువారాని కల్లా ఈ సంఖ్య 300కు చేరింది.

NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!


విద్యార్థులు అరెస్టైన విషయాన్ని యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ ధ్రువీకరించారు. నిరసనలు కట్టిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసినా వినిపించుకోకపోవడంతో అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే, విద్యార్థులపై ఎటువంటి బలప్రయోగం చేయలేదని స్పష్టం చేశారు. ప్రిన్స్‌స్టన్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్టైన్, ప్రిన్స్‌స్టన్ పాలస్టైన్ లిబరేషన్ కొయెలిషన్ తదితర విద్యార్థి సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి.

అంతకుముందు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు నిరసనల విషయమై ఈమెయిల్ చేశారు. యూనివర్సిటీ భవనాల్లోకి రాకపోకలను అడ్డుకునేలా బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలపడం, క్యాంపస్ పరిసరాల్లో గుడారాలు వేసి నిరసనలు తెలపడం, అక్కడే నిద్రించడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాత్కాలిక నిషేధం, సర్టిఫికేట్ల జారీలో జాప్యం, శాశ్వత నిషేధం తదితర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక అమెరికాలోని హార్వర్డ్, యేల్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కూడా పాలస్తీనా అనుకూల నిరసనలు మిన్నంటాయి.

Read Latest NRI and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 06:23 PM