Share News

మహానేత జీవిత ‘చిత్ర’కథ

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:02 AM

మాటల్లో చమత్కారాలూ, విరుపులూ, మెరుపులూ, ప్రాసలూ అలవోకగా జాలువారే వెంకయ్య నాయుడి వాగ్ధాటి అందరికీ తెలుసు. తెలిసిన సంగతులు పక్కనబెట్టి ఆయన జీవిత కథను చిత్రాల్లో చెప్పటంలో విజయం సాధించిన అందమైన పుస్తకం ‘మహానేత’. భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి జీవితాన్ని దృశ్య కావ్యంగా మలిచారు సంజయ్‌ కిషోర్‌.

మహానేత జీవిత ‘చిత్ర’కథ

మాటల్లో చమత్కారాలూ, విరుపులూ, మెరుపులూ, ప్రాసలూ అలవోకగా జాలువారే వెంకయ్య నాయుడి వాగ్ధాటి అందరికీ తెలుసు. తెలిసిన సంగతులు పక్కనబెట్టి ఆయన జీవిత కథను చిత్రాల్లో చెప్పటంలో విజయం సాధించిన అందమైన పుస్తకం ‘మహానేత’. భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి జీవితాన్ని దృశ్య కావ్యంగా మలిచారు సంజయ్‌ కిషోర్‌. అరుదైన, అద్భుతమైన ఫోటోల సేకరణకు, వాటికి పుస్తక రూపం ఇవ్వటానికి పేరుమోసిన వారు కావటంతో వెంకయ్యనాయుడి జీవితంలోని అన్ని కోణాలనూ, ఆయన అనుభవాల పరంపరనూ, ఎదుగుదలనూ, వ్యక్తిత్వాన్నీ ఆవిష్కరించేలా తీర్చిదిద్దారు.


బాల్యం, చదువు, విద్యార్థి రాజకీయాల మీదుగా ఆయన చట్టసభలకు ఎన్నికవటం సినిమా రీలులా మన కళ్ళముందు కదులుతుంది. బీజేపీ రాష్ట్ర నేతగా ఉంటూనే పెద్దల దృష్టిలో పడి తన నిబద్ధతతో ఆకట్టుకొని జాతీయ స్థాయిలో నిలదొక్కుకున్న తీరు ఈ పుస్తకపు పేజీల ప్రవాహంలో నిక్షిప్తమై ఉంది. కేంద్రమంత్రిగా వివిధ శాఖల మీద ఆయన వేసిన ముద్ర, ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో సభా నిర్వహణ ..


మొత్తంగా నెల్లూరు జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి ఉప రాష్ట్రపతిగా, పద్మవిభూషణుడిగా ఎదిగిన తీరు అందరికీ మరోమారు గుర్తు చేస్తుందీ కాఫీ టేబుల్‌ బుక్‌. ఆయన సేవాభావం, కూతురి ఆధ్వర్యంలో నడిచే స్వర్ణ భారత్‌ ట్రస్టుకు ప్రోత్సాహం, ఆయన అందుకున్న సత్కారాలూ, పురస్కారాలూ, ఆయన మీద వెలువడిన పుస్తకాలు, ఆయన పేరిట నెలకొల్పిన అవార్డులు ప్రస్తావిస్తూ ఆయన హాబీలను, జ్ఞాపకాలను పొందుపరచి పుస్తకానికి ఆహ్లాదకరమైన ముగింపునిచ్చారు.

- బి.ఎన్‌.

మహానేత (ముప్పవరపు వెంకయ్య నాయుడు)

రచన, సేకరణ, రూపకల్పన: సంజయ్‌ కిషోర్‌

పేజీలు: 322; వెల: రూ.1000; ప్రతులకు: 73824 30999]

Updated Date - Nov 03 , 2024 | 10:02 AM