Share News

Viral: వైద్యురాలి దారుణం! కూతురితో పేషెంట్ పుర్రెకు రంధ్రం చేయించిన వైనం

ABN , Publish Date - Sep 08 , 2024 | 09:26 AM

ఆస్ట్రియాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యురాలు ఆపరేషన్ సందర్భంగా తన కూతురితో పేషెంట్ పుర్రెకు యంత్రంతో చిల్లుపెట్టించిందన్న ఆరోపణలు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి.

Viral: వైద్యురాలి దారుణం! కూతురితో పేషెంట్ పుర్రెకు రంధ్రం చేయించిన వైనం

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రియాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వైద్యురాలు ఆపరేషన్ సందర్భంగా తన కూతురితో పేషెంట్ పుర్రెకు యంత్రంతో చిల్లుపెట్టించిందన్న ఆరోపణలు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. గ్రాజ్ నగరంలోని యూనివర్సిటీ హాస్పిటల్ గ్రాజ్‌లో ఈ ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది (Viral) .

పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది జనవరిలో 33 ఏళ్ల వ్యక్తికి యాక్సిడెంట్‌ జరగడంలో గ్రాజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ సందర్భంగా పేషెంట్‌కు ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో ఓ వైద్యురాలు తన 13 ఏళ్ల కూతురిని శస్త్రచికిత్సకు పిలిచి ఆమెతో పేషెంట్‌ పుర్రెకు రంధ్రం చేయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఓ సీనియర్ సర్జన్‌తో పాటు మరో ఐదుగురు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి ఓ అజ్ఞాత వ్యక్తి అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తాజాగా ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం బయటపడింది. అయితే, బాధిత పేషెంట్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తన దైనందిన జీవితం కొనసాగిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

Viral: లైఫ్‌లో సంతృప్తి లేదని 54 లక్షల జీతమిచ్చే జాబ్‌కు రాజీనామా! చివరకు..


ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది. పేషెంట్‌ను ప్రమాదంలో పడేసిన ఇద్దరు సర్జన్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు పేర్కొంది. కట్టుతప్పుతున్న సర్జన్లను అడ్డుకోకుండా తమ చట్టబద్ధమైన బాధ్యత నిర్వహించడంలో విఫలమైన సహాయక సిబ్బందిపైనా దర్యాప్తు జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వారిని కూడా తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు పేర్కొంది. అయితే, బాలిక పేషెంట్ పుర్రెకు రంధ్రం చేసిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని కూడా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే, ఘటనపై బాధిత పేటెంట్ కూడా స్పందించాడు. అప్పట్లో తనకీ ఘటన జరిగినట్టు కూడా తెలీదని వెల్లడించాడు. పేపర్లో ఈ ఉదంతం గురించి చదివాక తానే ఆ పేషెంట్ అయ్యుండొచ్చన్న అనుమానం కలగిందన్నాడు. లాయర్ సాయంతో ప్రస్తుతం అతడు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు.


‘‘పేషెంట్ స్పృహ లేకుండా ఆపరేషన్ బెడ్ పై ఉన్నాడు. వారికి ఓ గినీ పిగ్ లాగా మారిపోయాడు. ఇలాంటివి అస్సలు సహించకూడదు. ఘటన జరిగిన తరువాత కూడా పేషెంట్‌కు ఎవరూ ఈ విషయం చెప్పలేదు. క్షమాపణ కోరలేదు. ఇది చాలా దారుణం’’ అని పేషెంట్ తరపు లాయర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన పేషెంట్‌కు వేదన కలిగించినందుకు ఆసుపత్రి వర్గాలు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశాడు. ఆపరేషన్ తరువాత తన క్లైంట్ పూర్తిగా కోలుకోలేదని, ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా పేషెంట్‌కు ఆసుపత్రి యాజమాన్యం క్షమాపణ చెప్పింది.

Read Latest and Viral News

Updated Date - Sep 08 , 2024 | 09:51 AM