మనోళ్లే చాంపియన్లు
ABN , Publish Date - Nov 21 , 2024 | 06:12 AM
టోర్నమెంట్ ఆది నుంచి దూకుడైన ఆట..ఫలితంగా అప్రతిహత విజయాల బాట..దీంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ టైటిల్ భారత మహిళల
ఫైనల్లో చైనాపై గెలుపు
దీపిక మెరుపు గోల్
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రాజ్‌గిర్ (బిహార్): టోర్నమెంట్ ఆది నుంచి దూకుడైన ఆట..ఫలితంగా అప్రతిహత విజయాల బాట..దీంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ టైటిల్ భారత మహిళల ఖాతాలో వచ్చిచేరింది. బుధవారం జరిగిన ఫైనల్లో సలీమా టేటె సారథ్యంలోని భారత్ ఏకైక గోల్‌తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాను 1-0తో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. యువ స్ట్రయికర్ దీపిక కళ్లు చెదిరే రివర్స్ హిట్ గోల్‌తో భారత్ విజయంలో కీలక భూమిక పోషించింది. 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను అద్భుత గోల్‌గా మలిచిన దీపిక..టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ (11) చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లోనూ మన మహిళలు 3-0తో చైనాను చిత్తు చేసిన విషయం తెలిసిందే. భారత్‌కిది మూడో చాంపియన్స్ ట్రోఫీ. గతంలో 2016, 2023లో మనమ్మాయిలు విజేతలుగా నిలిచారు. ఈ క్రమంలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు నెగ్గిన జట్టుగా దక్షిణకొరియాతో భారత్ సమంగా నిలిచింది. మరో మ్యాచ్‌లో 4-1తో మలేసియాపై గెలుపొందిన జపాన్ మూడో స్థానం కైవసం చేసుకుంది. కాగా, విజేత భారత జట్టులోని ఒక్కో సభ్యురాలికి రూ. 10 లక్షల చొప్పున నజరానా ఇవ్వనున్నట్టు ఆతిథ్య రాష్ట్రం బిహార్ ప్రకటించింది.
హోరాహోరీ..
భారత్-చైనా తుదిపోరు ఆసాంతం నువ్వా..నేనా..అనేలా సాగింది. ఇరు జట్లు పలుమార్లు సర్కిల్ లోపలికి దూసుకెళ్లి గోల్స్ చేసేందుకు యత్నించాయి. కానీ ఆయా జట్ల రక్షణ శ్రేణులు ఆ అవకాశాలను వమ్ము చేశాయి. రెండో క్వార్టర్ మూడో నిమిషంలో చైనాకు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ భారత గోల్ కీపర్ బిచు దేవి ఖరింబమ్ అమోఘంగా డైవ్ చేసి జిన్‌జువాంగ్ షాట్‌ను అడ్డుకుంది. తదుపరి రెండు నిమిషాల్లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్లు దక్కినా..ఒక్క దానినీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 23వ నిమిషంలో చైనాకు ఇంకో పెనాల్టీ కార్నర్ లభించినా..భారత్ అడ్డుకుంది. మరోవైపు కెప్టెన్ సలీమా అందించిన పాస్‌ను షర్మిలా దేవి గోల్‌పోస్ట్ ఆవలిగా కొట్టడంతో ఖాతా తెరిచే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. అనంతరం చైనాపై పదేపదే ఒత్తిడి పెంచిన భారత క్రీడాకారిణులు..ఐదో పెనాల్టీ కార్నర్ దక్కించుకొన్నారు. ఈసారి దీపిక సూపర్ షాట్‌తో బంతిని గోల్‌పో్‌స్టలోకి పంపి జట్టును ఆధిక్యంలో నిలిపింది. 42వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. కానీ దీపిక షాట్‌ను చైనా కీపర్ లి టింగ్ అడ్డుకుంది. ఆ వెంటనే సుశీల చాను షాట్‌నూ గోల్‌లోకి వెళ్లకుండా టింగ్ ఆపింది. తర్వాత గోల్ చేసేందుకు చైనా ప్రయత్నించినా భారత రక్షణశ్రేణి ముందు వారి ఆటలు సాగలేదు.