CSK vs LSG: విధ్వంసం సృష్టించిన సీఎస్కే.. లక్నో ముందు భారీ లక్ష్యం
ABN , Publish Date - Apr 23 , 2024 | 09:33 PM
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో పాటు శివమ్ దూబే అర్థశతకంతో చెలరేగడంతో.. సీఎస్కే జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఓ మెరుపు మెరిపించాడు. ఒక బంతి మిగిలిన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఆ బంతిని ఫోర్‌గా మలిచాడు.
బ్యాటింగ్‌కి దిగినప్పుడు చెన్నైకి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది. కేవలం ఒక్క రన్ చేసి అజింక్యా రహానే ఔట్ అయ్యాడు. అయితే.. రుతురాజ్ మాత్రం మొదటి నుంచే పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. మధ్యలో డేరిల్ మిచెల్, జడేజా వచ్చారు కానీ.. వాళ్లు పెద్దగా సత్తా చాటలేదు. 101/3 స్కోర్ వరకూ రుతురాజ్ ఒంటరి పోరాటం చేశాడు. జడేజా ఔట్ అయ్యాక వచ్చిన దూబే తర్వాత సీఎస్కే స్కోరు మరింత పరుగులు పెట్టింది. అటు రుతురాజ్, ఇటు దూబే.. ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో తాండవం చేశారు. ఈ క్రమంలోనే దూబే కేవలం 27 బంతుల్లోనే 7 సిక్సులు, 3 ఫోర్ల సహకారంతో 66 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడం వల్లే సీఎస్కే స్కోరు 200 మార్క్‌ని దాటింది.
ఇక లక్నో బౌలర్ల విషయానికొస్తే.. దాదాపు ప్రతి ఒక్కరూ చెన్నై బ్యాటర్లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క మ్యాట్ హెన్రీ మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అతడి ఎకానమీ మాత్రమే బాగుంది. మిగతా బౌలర్లు మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ ఠాకూర్, మోహసిన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. లక్నో 211 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. అంత భారీ స్కోరుని లక్నో ఛేధిస్తుందా? లేదా? అనేదే వేచి చూడాలి.