India vs Zimbabwe: జింబాబ్వేపై భారత్ విజయం.. ఇంకో అడుగు దూరంలోనే!
ABN , Publish Date - Jul 10 , 2024 | 08:06 PM
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో..
జింబాబ్వేతో (Zimbabwe) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు (Team India) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుని మట్టికరిపించింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. నిర్దేశించిన లక్ష్యాన్ని జింబాబ్బే ఛేధించలేకపోయింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 159 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 23 పరుగుల తేడాతో భారత్ విజయఢంకా మోగించింది. ఈ విజయంతో భారత్ ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం సాధించింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ కైవసం చేసుకున్నట్లు అవుతుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ (66) అదరగొట్టడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వీ జైస్వాల్ (36) రాణించడంతో.. జింబాబ్వేకి భారత జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. ఆతిథ్య జట్టు బ్యాటర్లు తడబడ్డారు. డియోన్ మైయర్స్ (65), క్లివ్ మదండే (37) గట్టిగానే పోరాడారు కానీ.. మిగిలిన ప్లేయర్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో, వారి ప్రయత్నం వృధా అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఎవరూ ఎక్కువసేపు నిలకడగా రాణించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 159/6 స్కోరుకే జింబాబ్వే చాపచుట్టేయాల్సి వచ్చింది.
భారత బౌలర్ల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్ అవేశ్ ఖాన్ రెండు వికెట్లైతే తీశాడు కానీ, అతడు కాస్త ఎక్కువ పరుగులే సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 39 పరుగులు ఇచ్చాడు. ఇక ఖలీల్ సైతం కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి.. ఒక వికెట్ తీశాడు. ఈసారి రవి బిష్ణోయ్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. అతడు నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేదు.
స్కోర్లు
భారత్: 182/4
జింబాబ్వే: 159/6
Read Latest Sports News and Telugu News