Share News

MS Dhoni: ఎంఎస్ ధోనీకి మనోజ్ తివారి సూటి ప్రశ్న.. మరి జవాబిస్తాడా?

ABN , Publish Date - Feb 21 , 2024 | 04:37 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి అడిగితే.. తోటి ఆటగాళ్లందరూ పాజిటివ్‌గానే స్పందిస్తారు. ఎంతో కూల్‌గా ఉంటాడని, అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని, ప్రతిఒక్కరిని ప్రోత్సాహిస్తాడని చెప్తారు. ఇలా సానుకూల అభిప్రాయాలనే పంచుకుంటారే గానీ, ధోనీపై వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు పెద్దగా లేవు.

MS Dhoni: ఎంఎస్ ధోనీకి మనోజ్ తివారి సూటి ప్రశ్న.. మరి జవాబిస్తాడా?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గురించి అడిగితే.. తోటి ఆటగాళ్లందరూ పాజిటివ్‌గానే స్పందిస్తారు. ఎంతో కూల్‌గా ఉంటాడని, అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని, ప్రతిఒక్కరిని ప్రోత్సాహిస్తాడని చెప్తారు. ఇలా సానుకూల అభిప్రాయాలనే పంచుకుంటారే గానీ, ధోనీపై వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ.. మనోజ్ తివారి (Manoj Tiwari) మాత్రం ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తరఫున 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ బెంగాల్ క్రీడామంత్రి.. ధోనీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2011లో తాను తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ.. ధోనీ తనను జట్టులో నుంచి తొలగించాడంటూ కుండబద్దలు కొట్టాడు. ఫిబ్రవరి 19న ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తివారి ఈ వ్యాఖ్యలు చేశాడు.


‘‘2011లో నేను వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్‌ని గెలుచుకున్నాను. అయితే.. ఆ తర్వాత నన్ను వరుసగా 14 మ్యాచ్‌లకు దూరం పెట్టారు. నన్నిలా ఎందుకు పక్కన పెట్టారో ధోనీని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. 2012లో ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సురేశ్ రైనా (Suresh Raina) వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పెద్దగా పరుగులు చేయలేదు. అలాంటి టైంలోనూ నన్ను పట్టించుకోలేదు. నేను 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినప్పుడు నా బ్యాటింగ్ సగటు 65. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించగా.. చెన్నైలో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో నేను 130 పరుగులు చేశాను. అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 93 పరుగులు చేశాను. నేను టెస్ట్ క్యాప్ పొందడానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు.. నాకు బదులుగా యువరాజ్ సింగ్‌ను ఎంచుకున్నారు. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు ఎవరైనా దాన్ని నాశనం చేస్తే, అప్పుడు ఆటగాడి కెరీర్ అంతమవుతుంది’’ అంటూ మనోజ్ తివారి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఇదిలావుండగా.. మనోజ్ తివారీ 2008లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. తన ఏడేళ్ల కెరీర్‌లో అతడు 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2011 డిసెంబర్‌లో అతడు చెన్నైలో వెస్టిండీస్‌పై 104 (నాటౌట్) పరుగులు చేసి, తొలి సెంచరీ నమోదు చేశాడు. ఎందుకో తెలీదు కానీ, ఆ తర్వాత అతడ్ని జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేశారు. చివరిసారి అతను భారత జట్టు తరఫున 2015లో జింబాబ్వేపై ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. మొత్తం 148 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సాధించాడు. అటు ఐపీఎల్‌లోనూ 98 మ్యాచ్‌లు ఆడిన తివారి.. ఆ లీగ్‌లో మొత్తం 1695 పరుగులు చేశాడు. మరి.. తివారి సంధించిన ప్రశ్నకు ధోనీ బదులిస్తాడా? లేక పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడా? అనేది చూడాలి.

Updated Date - Feb 21 , 2024 | 04:37 PM