Virat Kohli: నిరాశలో విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఏం చేశాడో తెలుసా?
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:35 PM
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి నిరాశపరుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ.. సెమీ ఫైనల్ పోరులో మాత్రం దుమ్ముదులిపేస్తాడని అందరూ భావించారు. ఇంగ్లండ్ బౌలర్లపై దండయాత్ర చేసి...
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ప్రారంభమైనప్పటి నుంచి నిరాశపరుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. సెమీ ఫైనల్ పోరులో మాత్రం దుమ్ముదులిపేస్తాడని అందరూ భావించారు. ఇంగ్లండ్ బౌలర్లపై దండయాత్ర చేసి, భారత జట్టుని భారీ స్కోరు దిశగా నడిపిస్తాడని అనుకున్నారు. కానీ.. ఆ ఆశలను పటాపంచలు చేస్తూ అతను మళ్లీ నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ (9) స్కోరుతోనే పెవిలియన్ చేరాడు. ఈ టోర్నీలో అతను సింగిల్ డిజిట్‌కే ఔట్ అవ్వడం ఇది ఐదోసారి. దీంతో.. భారత క్రికెట్ అభిమానులు ఎంతో డిజప్పాయింట్ అయ్యారు.
క్రీడాభిమానులే కాదు.. కోహ్లీ సైతం తాను కీలక మ్యాచ్‌లో తాను సరిగ్గా రాణించలేకపోయానన్న ఆవేదనలో కనిపించాడు. డగౌట్‌లో తన సహచర ఆటగాళ్లతో కలిసి కూర్చున్న అతను ముభావంగా కనిపించాడు. ఇది గమనించిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. కోహ్లీని ఓదార్చేందుకు గాను అతని వద్దకు వెళ్లాడు. ‘‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే. ఇలా ముభావంగా ఉండకు, చీర్ అప్’’ అన్నట్టు అతనిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అందుకు కోహ్లీ సైతం ఏదో బదులిచ్చాడు. కానీ.. అతను నిరాశగా, మళ్లీ ఫెయిల్ అయ్యానన్న ఆవేదనతో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అటు.. నెటిజన్లు సైతం కోహ్లీకి అండగా నిలిచారు.
కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు 68 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో పాటు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో.. ఇంగ్లండ్‌కు భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. భారత బౌలర్ల ధాటికి 103 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Latest Sports News and Telugu News