Shivam Dube: నాలోని ప్రతిభను గుర్తించింది ధోనీయే.. సీఎస్కే కెప్టెన్‌కు, కోచ్‌కు థ్యాంక్స్ చెప్పిన శివమ్ దూబే!
ABN , Publish Date - Jan 16 , 2024 | 06:52 AM
యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియాలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ ఎంతో మంది కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు.
యువ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియాలోనూ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్‌లోనూ ఎంతో మంది కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. వారిలో చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తాజాగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ-20 (IND vs AFG T20 Series) మ్యాచ్‌ల్లోనూ యువ ఆటగాడు శివమ్ దూబే (Shivam Dube) అద్భుతంగా రాణించాడు.
శివమ్ దూబే ఈ టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో వరుస హాఫ్ సెంచరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన మెరుగైన ఆటతీరు వెనుక సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారని తాజాగా శివమ్ తెలిపాడు. వారిద్దరికీ అతడు ధన్యవాదాలు తెలియజేశాడు. తొలి టీ-20లో 40 బంతుల్లో అజేయంగా 60 పరుగులు, రెండో మ్యాచ్ లో 32 బంతుల్లోనే అజేయంగా 63 పరుగులు చేసి భారత్ జట్టుకు విజయం అందించాడు. అనంతరం తన గేమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
``నా ఆటతీరుకు సంబంధించిన క్రెడిట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి, కోచ్ ఫ్లెమింగ్‌కు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలోని ఆటను గుర్తించి ప్రోత్సహించారు. చాలా అవకాశాలు ఇచ్చారు. నాలోని అత్యుత్తమ ప్రతిభను వెలికి తీయడంలో వారు కీలక పాత్ర పోషించార``ని ఒక దూబే పేర్కొన్నాడు. ఇండోర్‌లో ఆదివారం అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. 32 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లతో అజేయంగా 63 పరుగులు చేశాడు.