ఇప్పటికి.. 25
ABN , Publish Date - Sep 06 , 2024 | 01:35 AM
గత మూడు రోజులుగా పతకాల పంట పండించిన భారత్ జోరు నెమ్మదించింది. గురువారం.. దృష్టిలోపం ఉన్న పారా జుడోకా కపిల్ పర్మార్ కాంస్యం మాత్రమే భారత్ ఖాతాలో చేరింది. దీంతో ఈ క్రీడల్లో లక్ష్యంగా పెట్టుకొన్న మొత్తం పతకాల సంఖ్య 25 (5 స్వర్ణ, 9 రజత, 11 కాంస్య)కు చేరింది...
పాతిక పతకాలతో భారత్ అదుర్స్
జూడోలో కపిల్‌కు అనూహ్య కాంస్యం
పారాలింపిక్స్
పారిస్: గత మూడు రోజులుగా పతకాల పంట పండించిన భారత్ జోరు నెమ్మదించింది. గురువారం.. దృష్టిలోపం ఉన్న పారా జుడోకా కపిల్ పర్మార్ కాంస్యం మాత్రమే భారత్ ఖాతాలో చేరింది. దీంతో ఈ క్రీడల్లో లక్ష్యంగా పెట్టుకొన్న మొత్తం పతకాల సంఖ్య 25 (5 స్వర్ణ, 9 రజత, 11 కాంస్య)కు చేరింది. ఇంకా పలు పోటీలు మిగిలివున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే అనుకున్న టార్గెట్‌ను చేరడం అమితానందాన్ని కలిగించేదే. 64 సంవత్సరాల పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని పతకాలు ఎప్పుడూ సాధించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో 19 పతకాలు కైవసం చేసుకుంది.
పురుషుల జూడో జె-1 60 కిలోల విభాగం కాంస్య పోరులో పర్మార్ 10-0తో ఎలియల్‌టన్ డి ఒలివేరియా (బ్రెజిల్)ను మట్టికరిపించాడు. జూడోలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. సెమీస్‌లో పర్మార్ 0-10తో బనితబ ఖుర్రమ్ అబాడి (ఇరాన్) చేతిలో ఓడాడు. 2022 ఆసియా క్రీడల్లో కపిల్ రజతం సాధించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన పర్మార్ పొలంలో ఆడుకొంటూ మోటార్‌ను ముట్టుకోగా షాక్ తగిలింది. స్పృహతప్పి పడిపోయిన అతడిని గ్రామస్థులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. ఆరు నెలలపాటు కోమాలో ఉన్న కపిల్ ప్రాణాలతో బయటపడినా కంటిచూపు దెబ్బతింది. కపిల్ తండ్రి ఓ టాక్సీ డ్రైవర్ కాగా.. అతడి రెండో అన్న లలిత్ జూడో నేర్చుకొనే వాడు. అతడి సహకారంతోనే పర్మార్ కూడా బ్లైండ్ జూడోను నేర్చుకొన్నాడు. కాగా, బతుకు తెరువు కోసం కపిల్ అన్నతో కలసి టీస్టాల్ నడుపుతున్నాడు. మహిళల 48 కిలోల జె-2 కేటగిరీ రెపిచేజ్ రౌండ్‌లో కోకిల 0-10తో ఇవనిత్సిక (ఉక్రెయిన్) చేతిలో ఓడింది.
హరీందర్‌కు ‘డబుల్’ మిస్..
స్వర్ణంతో అదరగొట్టిన రికర్వ్ ఆర్చర్ హర్వీందర్ సింగ్ త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకొన్నాడు. మిక్స్‌డ్ రికర్వ్‌లో షూటా్‌ఫలో తడబడిన హరీందర్ జంట పాయింట్ తేడాతో కంచు పతకం చేజార్చుకొంది. కాంస్య పోరులో హరీందర్-పూజ జోడీ 4-5తో స్లొవేనియాకు చెందిన డెజాన్ ఫాబ్‌కిక్-జివా లావ్రింక్ చేతిలో పోరాడి ఓడింది. 1, 3 సెట్లలో భారత్ జోడీ నెగ్గగా.. 2, 4 సెట్లలో స్లొవేనియా జంట గెలవడంతో స్కోరు 4-4తో సమమైంది. కానీ, షూటా్‌ఫలో హర్వీందర్ (8 పాయింట్లు), పూజ (9 పాయింట్లు) మొత్తం 17 పాయింట్లు సాధించగా.. స్లొవేనియా జంట 19 పాయింట్లు స్కోరు చేసి గెలిచింది. సెమీ్‌సలో హర్వీందర్-పూజ జంట 2-6తో ఇటలీకి చెందిన ఎలిజబెటా-స్టెఫనో ట్రావిశాని చేతిలో పరాజయం పాలైంది.
షూటర్ల గురి తప్పింది..
మిక్స్‌డ్ 50 మీటర్ల ప్రోన్ ఎస్‌హెచ్1లో భారత షూటర్లు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మోనా అగర్వాల్ 610.5 పాయింట్లతో 30వ స్థానంలో, సిద్దార్థ్ బసు 615.5 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచారు.
సిమ్రన్‌కు 4వ స్థానం
మహిళల 100 మీటర్ల టీ12 కేటగిరీలో భారత అథ్లెట్ సిమ్రన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్లో తలపడిన నలుగురిలో సిమ్రన్ 12.31 సెకన్ల టైమింగ్‌తో విఫలమైంది. ఒమారా డ్యూరాండ్ 11.81 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సొంతం చేసుకోగా.. ఒక్సానా (ఉక్రెయిన్), కట్రీన్ మ్యూలర్ (క్యూబా) రజత, కాంస్యాలు దక్కించుకొన్నారు.
అశోక్ విఫలం..
పవర్ లిఫ్టింగ్ 65 కిలోల విభాగంలో భారత ఆటగాడు అశోక్ ఆరో స్థానంలో నిలిచాడు. మూడు ప్రయత్నాల్లో 196, 199 కిలోల బరువు ఎత్తిన అశోక్.. మూడో ప్రయత్నంలో 206 కిలోలు లిఫ్ట్ చేయలేక పోయాడు.