Cyber Scam: డిజిటల్ అరెస్ట్‌లో డబ్బు మోసపోతే.. తిరిగి ఎలా పొందాలంటే..
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:51 PM
ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల ద్వారా ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలా ఈ మధ్య ఎక్కువ కాలంలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలమా? అందుకోసం ఏం చేయాలి..
ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల ద్వారా ప్రజల నుంచి డబ్బు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలా ఈ మధ్య ఎక్కువ కాలంలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. ముఖ్యంగా మహిళలు, విశ్రాంత ఉద్యోగులే వీళ్ల టార్గెట్. మేం ఈడీ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని భయభ్రాంతులకు గురిచేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? డిజిటల్ అరెస్ట్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలమా? అందుకోసం ఏం చేయాలి..
డిజిటల్ అరెస్ట్ అంటే: అమాయక ప్రజల డబ్బు దోచుకునేందుకు సైబర్ కేటుగాళ్లు ఎంచుకున్న మరో దారే డిజిటల్ అరెస్ట్. ముందుగా ఎంపిక చేసుకున్న వ్యక్తికి సీబీఐ లేదా ఈడీ అధికారులమంటూ వీడియో కాల్ చేస్తారు. తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నందుకు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని భయపెడతారు. డ్రగ్స్ తీసుకున్నారనో, మనీ లాండరింగ్ వంటి తీవ్ర కేసుల్లో ఇరుక్కున్నారనో బెదిరిస్తారు. మీకేం తెలియదని చెప్పినా మీ సిమ్ కార్డ్ ద్వారా తీసుకున్న ఆధార్‌తో మోసం జరిగిందని నమ్మిస్తారు. ఉన్నచోట నుంచి కదలనివ్వకుండా చేసి ఊపిరాడనివ్వరు. సడన్‌గా కాల్ కట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మభ్యపెడతారు. చెప్పిన ఖాతాలోకి డబ్బు జమచేస్తే బెయిల్ ఇస్తామని ముగ్గులోకి దించుతారు. కొన్ని సార్లు కేసు నమోదుచేయకుండా మిమ్మల్ని రక్షిస్తామని నమ్మబలికి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తారు.
డిజిటల్ అరెస్టులో మోసపోయిన డబ్బును తిరిగి పొందవచ్చా?
డిజిటల్ అరెస్ట్‌లో మోసపోయిన డబ్బును రికవరీ చేయడం చాలా కష్టమైన పని. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరిట మోసపోయామని తెలిస్తే.. వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. 24 నుంచి 28 గంటల్లోపే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మీ ఖాతాలోని డబ్బు నేరగాళ్లు చేరకుండా బ్యాంకు ద్వారా లావాదేవి ఆపేందుకు వీలవుతుంది. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతాయి.
ఇక్కడ మీరు ఫిర్యాదు చేయవచ్చు:
మీరు డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యారని తెలిసిన వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇది కాకుండా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ సైట్‍లో కూడా మీ ఫిర్యాదు నమోదు చేయాలి . తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సైబర్ మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు. మీ బ్యాంక్‌కు నేరుగా వెళ్లడం లేదా బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం కూడా ముఖ్యం.