Share News

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:05 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్‌ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.

Adani Foundation: స్కిల్స్‌ వర్సిటీకి వంద కోట్లు

అదానీ ఫౌండేషన్‌ భారీ విరాళం

  • సీఎం రేవంత్‌కు చెక్కు ఇచ్చిన గౌతమ్‌ అదానీ

  • వర్సిటీకి తమ సహకారం ఉంటుందని హామీ

  • వర్సిటీ ప్రకటించాక భారీ కార్పొరేట్‌ విరాళం ఇదే

  • 500 కోట్ల కార్పస్‌ లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్‌ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్‌ అందించారు. ప్రభుత్వం నెలకొల్పనున్న స్కిల్స్‌ యూనివర్సిటీకి తమ గ్రూప్‌ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. స్కిల్స్‌ వర్సిటీని ప్రకటించిన తర్వాత కార్పొరేట్‌ కంపెనీల నుంచి అందిన అతి పెద్ద విరాళం ఇదే. రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతో స్కిల్స్‌ వర్సిటీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.


రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 150 ఎకరాల్లో ఏర్పాటు కానున్న వర్సిటీకి ఆగస్టు ఒకటో తేదీన శంకుస్థాపన చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను దీనికి చైర్మన్‌గా నియమించారు. వర్సిటీ నిర్వహణ పూర్తి బాధ్యతలను మీపైనే పెడుతున్నామని గత నెల 19న నిర్వహించిన వర్సిటీ తొలి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఆనంద్‌ మహీంద్రాను ఉద్దేశించి స్పష్టం చేశారు. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.


వర్సిటీకి భవిష్యత్తులోనూ నిధుల సమస్య రాకూడదన్న లక్ష్యంతో రూ.500 కోట్లతో ప్రత్యేకంగా కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు ఆర్థిక సహకారం అందించాలని కార్పొరేట్‌ కంపెనీలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.100 కోట్లను తొలి బోర్డ్‌ మీటింగులోనే సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఆ సమావేశంలోనే పలువురు పారిశ్రామికవేత్తలు కూడా తమ వంతు విరాళాలు ప్రకటించారు కూడా. తాజాగా అదానీ ఫౌండేషన్‌ రూ.100 కోట్లను అందించింది. ఈ నేపథ్యంలోనే వర్సిటీలో భాగస్వామ్యం అవుతున్న కార్పొరేట్‌ కంపెనీలు సైతం భారీ విరాళాలను ప్రకటించే అవకాశాలున్నాయి. వర్సిటీ తొలి బ్యాచ్‌ నవంబరు నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Updated Date - Oct 19 , 2024 | 03:05 AM