Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

PM Modi: ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన..

ABN , Publish Date - Mar 04 , 2024 | 07:12 AM

ఆదిలాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉదయం ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 10.20 గంటలకు నాగ్‌పూర్ నుంచి రానున్న ప్రధానికి గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.

PM Modi: ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన..

ఆదిలాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సోమవారం ఉదయం ఆదిలాబాద్‌ (Adilabad)లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 10.20 గంటలకు నాగ్‌పూర్ నుంచి రానున్న ప్రధానికి గవర్నర్ తమిళసై (Governor Tamilisai), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వాగతం పలకనున్నారు. ఈ క్రమంలో 9.30 గంటలకు ముఖ్యమంత్రి ఆదిలాబాద్ చేరుకోనున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం తిరిగి సీఎం వెళ్లనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కచ్‌కంటి నుంచి ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలను మళ్లించారు. పాత సాత్నాల రహదారి నుంచి ఆదిలాబాద్‌కు దారి మళ్లించారు. కేఆర్‌కే కాలనీవాసులు పట్టణంలోకి వచ్చేందుకు మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు సాగించాలి. అలాగే పట్టణంలో సోమవారం సభాస్థలి, హెలిప్యాడ్‌, తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాని సభకు వచ్చే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను వినాయక చౌక్‌ వద్ద గల మధుర జిన్నింగ్‌, గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ వద్ద పార్కింగ్‌ చేయాలని సూచించారు. సభకు వచ్చే బస్సులను స్థానిక డైట్‌ కళాశాల మైదానం, రామ్‌లీలా మైదానం, టీటీడీసీ ఎదురుగా ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయాలని పోలీసులు పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల నగారా మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ.. రూ.15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం ఉదయం 9.20 గంటలకు ప్రధాని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.20కి ఆదిలాబాద్‌ చేరుకుంటారు. అక్కడ మోదీకి.. సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ తమిళి సై స్వాగతం పలకనున్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానితో పాటు సీఎం రేవంత్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జైనథ్‌ మండలం బోరజ్‌ నుంచి బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు రూ.491కోట్లతో చేపట్టనున్న (32.9కి.మీ) జాతీయ రహదారి 353(బి)విస్తరణ పనులు, రూ.136కోట్లతో చేపట్టే హైదరాబాద్‌-భూపాల పట్నం 163 జాతీయ రహదారి అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే రూ.6వేల కోట్లతో చేపట్టిన రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ యూనిట్‌, సుమారు రూ.70కోట్లతో చేపట్టిన అంబారి-ఆదిలాబాద్‌-పింపాలకుట్టి రైల్వేలైన్‌ విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేయనున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన సిమెంటు ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో 5 వేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపైనా ప్రధాని ప్రకటన చేయవచ్చని ఆ నేత తెలిపారు. సభ అనంతరం మోదీ తమిళనాడు పర్యటనకు వెళతారు. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం 6.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో బసచేస్తారు. మంగళవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో సంగారెడ్డి పర్యటనకు వెళతారు. అక్కడ సభలో పాల్గొంటారు. రూ.9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.1,298కోట్ల అంచనాతో ప్రతిపాదించిన పుణే-హైదరాబాద్‌ రహదారిలో సంగారెడ్డి ఎక్స్‌రోడ్‌ నుంచి మదీనగూడ వరకు 6లేన్ల హైవే విస్తరణ, మెదక్‌-ఎల్లారెడ్డి మధ్య విస్తరణ(రూ.399కోట్లు) పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం, పారాదీ్‌ప-హైదరాబాద్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌(రూ.3,338కోట్లు), మిర్యాలగూడ-కోదాడ జాతీయ రహదారి విస్తరణ (రూ.323కోట్లు) పనులను జాతికి అంకితం చేస్తారు. రూ.1,165కోట్లతో చేపట్టిన హైదరాబాద్‌-సికిందరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ఫేజ్‌ -2 ప్రాజెక్టును, ఘట్‌కేసర్‌-లింగంపల్లి కొత్త ఎంఎంటీఎస్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.

Updated Date - Mar 04 , 2024 | 07:14 AM