BJP: తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి..
ABN , Publish Date - May 08 , 2024 | 05:52 AM
కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో జరిగిన అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
రేవంత్‌కు ఇది గాడిద గుడ్డులా కనిపిస్తోంది
స్థాయిని మరచి, దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
ఏమీ దొరక్క.. ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు
భారత కీర్తి ప్రతిష్ఠలను తార స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీదే
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కావ్య
బంజారాహిల్స్/బర్కత్‌పుర/రాంనగర్, మే 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో జరిగిన అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి ఏమీ దొరక్క ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన రూ.పది లక్షల కోట్ల అభివృద్ధి రేవంత్‌కు గాడిద గుడ్డులా కనిపిస్తోందని అన్నారు. రేవంత్ స్థాయిని మరచి, దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
భారత్ కీర్తి ప్రతిష్ఠలను తార స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రధాని మోదీదని చెప్పారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత దేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయని అన్నారు. దేశంలో 2014 ముందు వరకు పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరిగేవని.. మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక్క దాడికి కూడా ఆస్కారం లేకుండా చేశారని పేర్కొన్నారు. దేశంలో ఐఎ్‌సఐని సమూలంగా నిర్మూలించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి విజయం కోసం ఆయన సతీమణి కావ్య రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్ వాసులు, మహిళా పొదుపు సంఘాలు, క్రీడాకారులు, వాకర్లు తదితరులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కావ్యకిషన్‌రెడ్డి ఇప్పటికే సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి, రెండో విడత ప్రచారాలు ముగించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్న ఆమె.. కుట్టు మెషీన్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తూ సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20 వేల మంది మహిళలు, యువతులకు శిక్షణ ఇప్పించారు. మహిళలకు కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు.