Share News

Bandi Sanjay: కేటీఆర్‌ను జైలుకు పంపకపోతే యుద్ధమే

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:03 AM

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని, సీఎం రేవంత్‌ గనక కేటీఆర్‌ను జైలుకు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌,

Bandi Sanjay: కేటీఆర్‌ను జైలుకు పంపకపోతే యుద్ధమే

  • నన్ను, మా కార్యకర్తలను, సీఎం రేవంత్‌నూ వేధించారు

  • రేవంత్‌పై నమ్మకం, గౌరముంది.. కేటీఆర్‌ను లోపలేస్తారు

  • ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు

  • కేసీఆర్‌ను అరెస్టు చేస్తే బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో సానుభూతి

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చర్చలనేది అంతా ఫేక్‌ ప్రచారం

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని, సీఎం రేవంత్‌ గనక కేటీఆర్‌ను జైలుకు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ‘‘నన్ను, మా కార్యకర్తలను, రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ కార్యకర్తలను నాడు కేటీఆర్‌ ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరూ మరచిపోరు. రేవంత్‌రెడ్డిపై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఏ రోజైనా ఆయన కేటీఆర్‌ను లోపల(జైల్లో) వేస్తారన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోయిన రోజు తెలంగాణలో రాజకీయ యుద్ధమే’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.


కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో సానుభూతి వస్తుందని, అందుకే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిజాంను తలపించేలా తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ఇప్పుడు ఒడ్డుకు పడ్డ చేపల్లాగా విలవిలలాడుతున్నారని సంజయ్‌ ఎద్దేవా చేశారు. శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు కీలక పోస్టింగులు ఇవ్వడం లేదని, బీఆర్‌ఎస్‌ కొంపముంచిన అధికారులనే సీఎం రేవంత్‌ చేరదీస్తున్నారని సంజయ్‌ అన్నారు. పైగా కీలక పోస్టుల్లో ఉన్న మంచి అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. అలాగైతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ సర్కారుకు తేడా ఏముందన్నారు.


రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ అని సంజయ్‌ స్పష్టం చేశారు. బీజేపీని ఎదర్కోవడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసివస్తాయని, ఆ రెండు పార్టీలను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని చెప్పారు. కాగా, తమ్ముడి కోసమే రేవంత్‌ అమెరికా వెళ్లారనడం సరికాదని సంజయ్‌ ఈ సందర్భంగా అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో బీఆర్‌ఎస్‌ చర్చలు జరుపుతోందన్న ప్రచారమంతా ఫేక్‌ అని సంజయ్‌ ఈ సందర్భంగా అన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే బీఆర్‌ఎస్‌ ఈ నాటకాలు ఆడుతోందన్నారు.


‘‘బీఆర్‌ఎస్‌ బహుశా బంగ్లాదేశ్‌ వెళ్లి అక్కడ ఎవరితోనైనా చర్చలు జరిపిందేమో. బీఆర్‌ఎస్‌ అంటే బంగ్లాదేశ్‌ రాష్ట్ర సమితి’’ అంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ కవితకు అనారోగ్యం దృష్ట్యా బెయిల్‌ వస్తే, బీజేపీనే బెయిల్‌ ఇప్పించిందని అంటారేమోనని సంజయ్‌ వ్యాఖ్యానించారు. మేడిగడ్డ కుంగిన ఘటనపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆగమేఘాలపై విచారణ జరిపింది గానీ, సుంకిశాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్న కేటీఆర్‌ విమర్శపై సంజయ్‌ స్పందించారు. ‘‘మేడిగడ్డపై ఫిర్యాదు వచ్చింది. సుంకిశాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు’’ అని చెప్పారు.


  • వక్ఫ్‌ భూములను కబ్జా చేసిన మజ్లిస్‌

పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక నిధులివ్వలేదని సంజయ్‌ అన్నారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని, ఈ విషయాన్ని మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల భూముల కొనుగోలు బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ ఓ నేతకు అప్పగించిందని సంజయ్‌ ఆరోపించారు.


మరోవైపు, గతంలో వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని సంజయ్‌ అన్నారు. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల సంఖ్యపై నివేదిక కోరినట్లు సంజయ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Updated Date - Aug 11 , 2024 | 04:03 AM