Share News

Telangana : బుల్లెట్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ పేలిన ఘటనలో బండి యజమాని మృతి

ABN , Publish Date - May 29 , 2024 | 03:55 AM

ఇటీవల బుల్లెట్‌ వాహనం ట్యాంక్‌ పేలిన ఘటనలో తీవ్రం గా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈది బజార్‌కి చెందిన ఆ వాహన యజమాని అబ్దుల్‌ రహీమ్‌ఖాన్‌ (29) మంగళవారం మృతి చెందాడు.

Telangana : బుల్లెట్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ పేలిన ఘటనలో   బండి యజమాని మృతి

ఈ ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

మరొకరి పరిస్థితి ఇంకా విషమం

చార్మినార్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ఇటీవల బుల్లెట్‌ వాహనం ట్యాంక్‌ పేలిన ఘటనలో తీవ్రం గా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈది బజార్‌కి చెందిన ఆ వాహన యజమాని అబ్దుల్‌ రహీమ్‌ఖాన్‌ (29) మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. భవాని నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12న రాత్రి మొఘల్‌పురాలోని నాజార్‌ ఫంక్షన్‌ హల్‌ వద్ద బుల్లెట్‌ వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.

దీంతో వాహనం నడుపుతున్న రహీమ్‌ఖాన్‌ దాన్ని రోడ్డు పక్కన ఆపి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా బుల్లెట్‌ పెట్రోల్‌ ట్యాంకు పేలింది. దీంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న 10 మందికి మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డారు.

వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నదీమ్‌, షౌకత్‌ అలీ, మొహమ్మద్‌ హుస్సేన్‌ ఖురేషిలు ఇప్పటికే మృతి చెందారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మంగళవారం అబ్దుల్‌ రహీమ్‌ ఖాన్‌ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - May 29 , 2024 | 03:55 AM