Rain Alert: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షం..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:56 PM
వాతావరణ కేంద్రం అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటన జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: వాతావరణ కేంద్రం అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటన జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే కాదు.. పరిసర జిల్లాలతో పాటు.. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అవసరమైతే తప్ప బయటకెళ్లొద్దు..
భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. జిల్లాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. చెట్ల కింద, బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు.
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో.. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అంతేకాదు.. పలు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులు వీస్తాయని తెలిపారు.