TG Politics:కేసీఆర్ దీక్ష ఫేక్.. విచారణ జరపాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:17 PM
అధికారం కొల్పోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు మండిపడ్డారు. గతంలో దీక్షా పేరుతో కేసీఆర్ ఫేక్ దీక్ష చేశారని ఆయన గుర్తు చేశారు. దీనిపై విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫేక్ అని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు శుక్రవారం ఢిల్లీలో విమర్శించారు. కేసీఆర్ చేసిన దొంగ దీక్ష దివాస్‌పై కమిటి వేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ దీక్ష చేసిన సమయంలో కేసీఆర్ జ్యూస్‌లు, మెడిసన్ తీసుకున్నారని ఆయన వివరించారు.
హరీష్ రావు.. అగ్గిపెట్టి
ఈ విషయాన్ని ఆ సమయంలోనే... తాను మీడియాకు వివరించానని గోనే ప్రకాష్ రావు తెలిపారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందాయన్నారు. ఇక కేసీఆర్ సమీప బంధువు.. హరీష్ రావు ఆత్మాహుతి చేసుకుంటానంటూ పెట్రోల్ డబ్బా పట్టుకుని బెదిరించారని.. కానీ ఆయన అగ్గి పెట్టే తెచ్చుకోలేదని వ్యంగ్యంగా అన్నారు.
కవిత రంగ ప్రవేశం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమకారులను రెచ్చగొట్టి.. 1200 మంది ప్రాణాలను కేసీఆర్ తీశారని గోనే ప్రకాశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. వారికి ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. అయితే దీక్ష దివాస్ పేరుతో గత రెండు రోజులు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒకటే హడావుడి చేస్తుందన్నారు. తెలంగాణ జాగృతి పేరిట కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం రంగ ప్రవేశం చేస్తున్నారని చెప్పారు.
ఇరోం షర్మిల.. కేసీఆర్
ఈశాన్య రాష్ట్రాల్లోని ఒకటైన ఇంఫాల్‌లో ఇరోం షర్మిల.. కేసీఆర్ కన్నా తక్కువ ఫ్లూయిడ్స్ తీసుకొని 13000 రోజులు దీక్ష చేసిందని ఈ సందర్బంగా గోనే ప్రకాష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన దొంగ దీక్షను బయటపెడతామని గతంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గోనే ప్రకాష్ రావు ప్రస్తావించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది మరణించారని తొలి అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని సైతం గోనే ప్రకాష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్‌ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గోనే ప్రకాష్ రావుపై విధంగా స్పందించారు. మరోవైపు.. గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఈ దీక్ష దివాస్‌ను నిర్వహించలేదనే ఓ చర్చ సైతం సాగుతుంది.
అధికారం కోల్పోయిన అనంతరం మళ్లీ బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్ పేరుతో కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అగ్రనేతలు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు ఓ ప్రచారం సైతం సాగుతుంది. అదీకాక.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకోలేదనే విమర్శ సైతం ఉంది. అలాగే ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం.. ఆయన పాలనలో తీసుకున్న నిర్ణయాలకు ఏ మాత్రం పొంతన లేదనే ఓ చర్చ సైతం నేటికి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది.
For Telangana News And Telugu News