Share News

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:01 AM

రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

  • రూ.2 లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం

  • ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హుళక్కే

  • రెన్యువల్‌ చేసుకుంటే పావలా వడ్డీ, లేకపోతే అధిక వడ్డీ

  • రైతు వాటా, ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ

  • రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్‌ చేసుకుంటున్న వైనం

  • డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు

  • నిధుల వేటలో ప్రభుత్వం, రూ.9 వేల కోట్లు అవసరం

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తన వాటా రూ.2 లక్షలు ఎప్పుడు చెల్లిస్తుంది, తమ వాటా ఎప్పుడు చెల్లించాలనే విషయంలో ఒక నిర్దిష్ట తేదీ చెప్పకపోవటంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే... రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో ఏడాదిలోపు చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ వస్తుంది. ఒకవేళ ఆలోపు చెల్లించకపోతే ఆ రాయితీ రాకపోగా అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుందని ఆందోళనకు గురవుతున్నారు. నిర్ణీత గడువులో రుణమాఫీ జరిగి, అప్పులు రెన్యువల్‌ అయితేనే రైతులకు చిక్కులు తొలగిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకంలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకు రైతులకు ఉన్న రుణాలను, వాటిపైన అయిన వడ్డీని కలిపి మాఫీ చేస్తామని ప్రకటించింది.


అయితే నెలలు గడుస్తున్న కొద్దీ... ప్రభుత్వం ఇచ్చిన మాటమేరకు రుణమాఫీ చేసినా వడ్డీ భారం మాత్రం రైతుల మీదే పడుతోంది. 7 శాతం వడ్డీలో 4 శాతం సబ్సిడీ తెచ్చుకోవాలంటే ఏడాదిలోపు ఆ రుణాన్ని కట్టేయాల్సి ఉంటుంది. లేదా రైతులు తమ వాటా కట్టేస్తే రూ.2 లక్షల వరకు ఉన్న రుణం, ఆలస్యంగా చెల్లించినందుకు అయ్యే అదనపు వడ్డీని తామే భరిస్తామంటూ ఒక నిర్దిష్ట తేదీ అయినా ఉండాలని వారు కోరుకుంటున్నారు. 2 లక్షల కేటగిరీలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయటానికి సుమారు రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. మరోవైపు వచ్చే నెల నుంచి రబీ సీజన్‌ రుణాల పంపిణీ ప్రారంభం కానుంది. అప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు.


  • రైతులకు రెన్యువల్‌ సమస్యలు

మరోవైపు రైతులను రెన్యువల్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులు సకాలంలో అప్పులు చెల్లించటంలేదు. రెన్యువల్‌ చేసుకోలేకపోతున్నారు. డబ్బులున్న రైతులు, లేదంటే బయట ప్రైవేటు అప్పులు తెచ్చుకునే పరపతి ఉన్నవాళ్లు రుణాన్ని రెన్యువల్‌ చేసుకుంటున్నారు. కానీ కొందరు రైతులు ఈ రెండూ అవకాశాలు లేకపోవటంతో రెన్యువల్‌ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు రెన్యువల్‌ చేసుకోకుంటే... ప్రభుత్వమూ రుణమాఫీ డబ్బులు రెండు లక్షలు విడుదల చేయకుంటే... తమ మొత్తం రుణానికి అయ్యే అధిక వడ్డీని తామే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఏరోజుకారోజు వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు మల్లయ్య అనే రైతుకు కటాఫ్‌ తేదీ నాటికి రూ.2.30 లక్షల బకాయి ఉండి... ఇప్పుడు అప్పు కట్టినా, రెన్యువల్‌ చేసుకున్నా 9 నెలల 15 రోజులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్టోబరు తొమ్మిదో నాటికి రెన్యువల్‌ చేసుకుంటే... 10 నెలల వడ్డీ, డిసెంబరు 9 లోపు చేసుకుంటే 12 నెలల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ భారమంతా రైతులపైనే పడుతుంది.


  • రెన్యువల్‌ చేసుకున్నా... రుణమాఫీ

రుణమాఫీ 2024 పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబరు తొమ్మిదో తేదీని కటాఫ్‌ తేదీగా తీసుకుంది. అప్పటివరకు రైతులు తీసుకున్న పంట రుణం, వడ్డీ కలిపి ఒక కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామనేది ప్రభుత్వ హామీ! అయితే రూ.2 లక్షల్లోపు బకాయిలున్న రైతులకు విడతల వారీగా రుణమాఫీ ప్రక్రియ నడుస్తోంది. రూ.2 లక్షలకు మించి అప్పులున్నవారికి పెండింగ్‌ పెట్టింది. కటాఫ్‌ తేదీ ముగిసి 9 నెలలు దాటిపోయింది. అక్టోబరు తొమ్మిదో తేదీ వస్తే 10 నెలలు అవుతుంది. ఈ కాలానికి రోజురోజుకు బ్యాంకులో వడ్డీ పెరుగుతోంది. రైతులేమో ప్రభుత్వం మాఫీ చేసేది చేస్తే... మిగిలిన అప్పును రెన్యువల్‌ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు.


అయితే ప్రభుత్వం రూ.2 లక్షలు ఇప్పటికిప్పుడు మాఫీ చేయకపోయినా... రెన్యువల్‌ చేసుకుంటే... రుణమాఫీ వర్తిస్తుందా? రెన్యువల్‌ చేసుకుంటే నష్టపోతామా? అనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టత ఉంది. 2023 డిసెంబరు తొమ్మిదో తేదీ నాటికి బాకీ ఉన్న అప్పు (ఔట్‌స్టాండింగ్‌) లెక్కలను ప్రభుత్వం తీసుకుంది. 2018 డిసెంబరు తొమ్మిదో తేదీ నుంచి 2023 డిసెంబరు తొమ్మిదో తేదీ మధ్యకాలంలో తీసుకున్న అప్పు, వడ్డీ.. మొత్తం రుణమాఫీ లెక్కలోకి వస్తుంది. 2023 డిసెంబరు 9 నాటికి బకాయిలు ఉండి... అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది. ఇప్పుడు అప్పు రెన్యువల్‌ చేసుకున్నప్పటికీ కటాఫ్‌ తేదీ నాటికి ఉన్న ఔట్‌స్టాండింగ్‌ లోన్‌ మాఫీ అవుతుంది. కాకపోతే ఆ తేదీ తర్వాత చెల్లించాల్సిన వడ్డీ భారం అంతా రైతు మీదే పడుతుంది.


  • రూ.9 వేల కోట్లు కావాలి

రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 డిసెంబరు తొమ్మిదో తేదీ నాటికి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులు సుమారు 42 లక్షల మంది ఉన్నారు. వీరిలో 22 లక్షల మందికి రూ.17,934 కోట్ల రుణమాఫీ చేశారు. మిగిలిన 20 లక్షల మందిలో కుటుంబ నిర్ధారణచేసి, అనర్హులను ఏరివేస్తే లబ్ధిదారుల సంఖ్య తేలుతుంది. అయితే రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు మాఫీ చేయటానికి సుమారు రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Updated Date - Sep 26 , 2024 | 04:01 AM