Share News

Hyderabad: ఎఫ్‌టీఎల్‌ నిల్‌!

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:55 AM

చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు.. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి!

Hyderabad: ఎఫ్‌టీఎల్‌  నిల్‌!
FTL

  • చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణలో మహా జాప్యం

  • హెచ్‌ఎండీఏ పరిధిలో 3500పైగా చెరువులు

  • తుది నోటిఫికేషన్‌ ప్రకటించింది 230కి మాత్రమే

  • 11 ఏళ్లలో 10 శాతంలోపు చెరువులకే..

  • ఇరిగేషన్‌, రెవెన్యూ మధ్య సమన్వయ లోపం

  • రెండు శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం

  • నోటిఫికేషన్ల జాప్యానికి ఇదీ ఓ కారణం

  • హైకోర్టు ఆదేశాలతో అధికారుల్లో కదలిక

  • ఆందోళనలో నిర్మాణదారులు..

  • స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు.. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి! చెరువులు అన్యాక్రాంతమవడంలో ఆయా శాఖల తీరు ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఉంది. చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ నిర్ధారణను కూడా అధికారులు పట్టించుకోలేదు! 11 ఏళ్లుగా సర్వే చేస్తున్నా.. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో కనీసం పది శాతం చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌కు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ జారీ కాలేదు! చెరువుల సంరక్షణలో కీలకమైన అంశాలను పక్కన పెట్టిన ప్రభుత్వ శాఖలు.. కబ్జాదారులకు ద్వారాలు తెరిచాయి. ‘రియల్‌’ ఒత్తిళ్లో.. ఉన్నతస్థాయి ఆదేశాలో తెలియదు కానీ..చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల నిర్ధారణకు నిర్వహించాల్సిన సర్వేను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టేశారు.


రెవెన్యూ, ఇరిగేషన్‌, ఇతర విభాగాలతో కలిసి చెరువుల సర్వే పూర్తి చేయాల్సిన హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సంస్థ పరిధిలో 3500పైగా చెరువులుండగా.. 7శాతంలోపు చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2540 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన హెచ్‌ఎండీఏ.. 230 చెరువులకు మాత్రమే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను నిర్ధారించడం గమనార్హం! గ్రేటర్‌ నుంచి ఔటర్‌ లోపలి, వెలుపలి ప్రాంతాల్లోని చెరువుల కబ్జాకు ఇదే ప్రధాన కారణం. ప్రలోభాలు, ఇతర అంశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను ఇష్టానికి మారుస్తూ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఇచ్చేశారు. కొన్నిచోట్ల ఎన్‌వోసీల అవసరం లేకుండానే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు జారీచేసేశారు. ప్రస్తుతం ‘హైదరాబాద్‌ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ కూల్చివేస్తున్న భవనా లు ఇలాఅనుమతులు పొందినవే కావడం గమనార్హం.


  • 3500లకు పైగా చెరువుల్లో..

హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 3,532 చెరువులున్నాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి జిల్లాల్లో ఉన్న చెరువుల విస్తీర్ణం క్రమంగా కుంచించుకుపోతోంది. ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలో 500 వరకు.. ఔటర్‌ వెలుపల 3 వేలకు పైగా చెరువులు ఉన్నాయి. అభివృద్ధి విస్తరణ క్రమంలో చెరువులను కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో చెరువుల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లా ల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. క్రమం తప్పకుండా కమిటీ సమావేశమై ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ల నిర్ధారణ సర్వే, నోటిఫికేషన్ల ప్రకటనను పర్యవేక్షించాలి. కానీ, ఈ కమిటీ సమావేశాలు నామమాత్రంగానే జరిగాయి. సర్వే నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండీఏ ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది.


రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలతోపాటు హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. విస్తీర్ణం వివరాలు, మ్యాపులు, వాస్తవ పరిస్థితులను పోల్చి చూసుకొని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌పై ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి.. వాటిని పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదంతో తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. చెరువుల విస్తీర్ణం, మ్యాపు, ఎఫ్‌టీఎల్‌, సర్వే నంబర్లు తదితర వివరాలన్నీ ఉంటాయి. ఒక్కో చెరువుకు ఒక్కో గుర్తింపు నంబరు కేటాయిస్తూ.. విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఒక్కసారి తుది నోటిఫికేషన్‌ ప్రకటించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని ఓ అధికారి తెలిపారు. హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో తుది, ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకటించిన చెరువులు వివరాలను అప్‌లోడ్‌ చేసినట్లు చెప్పారు.


  • ఏళ్ల తరబడి సాగుతున్న సర్వే..!

హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులపై 2013లో సర్వే మొదలైంది. 11 ఏళ్లలో 2540 చెరువులకు మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3 వేలకుపైగా చెరువుల సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక తుది నోటిఫికేషన్‌ జారీ చేసినవి 230 మాత్రమే. కొన్ని చెరువుల విస్తీర్ణం, సర్వే నంబర్లు, మ్యాపులు రెవెన్యూ, సాగునీటి శాఖల వద్ద వేర్వేరుగా ఉండడం కూడా ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీలో జాప్యానికి కారణమంటున్నారు. దీంతో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతున్నామని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌ మహానగర తాగునీటి వనరుల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ కూడా ఇంకా నిర్ధారణ కాలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక నోటిఫికేషన్‌ ఆధారంగా ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా.. హిమాయత్‌సాగర్‌ విషయంలో వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. ఇదిలా ఉంటే.. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అనుమతులున్న భవనాల్లో ఫ్లాట్లు కొనడానికి కూడా ప్రజలు వెనకంజ వేస్తున్నారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాల చుట్టూ తిరుగుతున్నారు. అనుమతులపై స్పష్టత ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను కోరుతున్నారు.


హైడ్రా పరిశీలనలో మాసబ్‌, దిలావర్‌ఖాన్‌ చెరువులు

  • చర్యలు తప్పవు: హైడ్రా అధికారులు

హయత్‌నగర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు హైడ్రా, నీటిపారుదలశాఖల అధికారులు స్పందించారు. రెండు రోజులుగా హైడ్రా ప్రత్యేక అధికారుల బృందం, స్థానిక నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్‌ చెరువు, తుర్కయంజాల్‌లోని మాసబ్‌ చెరువులను సందర్శించారు. ఇంజాపూర్‌లో నిర్మిస్తున్న డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను, ఆక్రమణకు గురవుతున్న దిలావర్‌ఖాన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ప్రాంతాలను పరిశీలించారు. పాత, కొత్త సర్వే మ్యాపులను పరిశీలించారు. గూగుల్‌ మ్యాపు ద్వారా చెరువు పూర్తి విస్తరణ, బఫర్‌ జోన్‌ వచ్చే ప్రాంతాలను కూడా చూశారు. దిలావర్‌ఖాన్‌ చెరువు, మాసబ్‌ చెరువు చుట్టూ తిరిగి ఆక్రమణలను పరిశీలించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


  • జిల్లాల వారీగా సర్వే..

చెరువుల సర్వేపై హెచ్‌ఎండీఏ ప్రత్యేకదృష్టి సారించింది. నిర్ణీత కాలవ్యవధిలో సర్వే పూర్తి చేసి నోటిఫికేషన్లు పంపాలని కలెక్టర్లకు లేఖలు రాసింది. ఆగస్టు 1 నుంచి 65 చెరువుల సర్వే పూర్తయిందని, 269 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశామని.. 30 చెరువుల వివరాలు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామని అధికారులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 51 చెరువుల తుది నోటిఫికేషన్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఔటర్‌ వరకు ఉన్న 500 చెరువులకు ఎఫ్‌టీఎల్‌, బపర్‌ జోన్‌ల నిర్ధారణపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. ’రికార్డుల ఆధారంగా నోటిఫికేషన్‌ ఇస్తాం. ఆక్రమణల విషయంలో ఏం చేయాలన్నది ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు’ అని హెచ్‌ఎండీఏ అధికారి చెప్పారు.

Updated Date - Sep 15 , 2024 | 08:21 AM