Share News

Krishna Basin: కృష్ణా ఆయకట్టుకు నీరు..

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:58 AM

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.

Krishna Basin: కృష్ణా ఆయకట్టుకు నీరు..

  • ఎగువ నుంచి భారీ వరద, ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో విడుదలకు నిర్ణయం

  • 14 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ఊపిరి.. ‘గోదావరి’పై 15 రోజుల్లో సమీక్ష

  • రేపు తెరుచుకోనున్న నాగార్జున సాగర్‌ గేట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా ప్రాజెక్టుల కింద 14.05 లక్షల ఎకరాలకు 125 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ చైర్మన్‌ ఈఎన్‌సీ (జనరల్‌) అనిల్‌ కుమార్‌ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) నుంచి నాగార్జున సాగర్‌ దాకా ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండటంతో ఈ జలాశయాల కింద పంటలకు నీటిని ఇవ్వడానికి ఇబ్బందుల్లేవని గుర్తించారు. ఇక, గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీంతో 15 రోజుల్లో మళ్లీ సమావేశమై నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నీటి పారుదల శాఖ యోచిస్తోంది. గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల కింద 17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. మొత్తంగా ఈ సీజన్‌లో కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నుంచి 32 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం 313 టీఎంసీల నీటిని అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Updated Date - Aug 04 , 2024 | 03:58 AM