Flood inflows: శ్రీశైలానికి వరద పోటు..
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:02 AM
అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
జలాశయానికి 5.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. సాగర్‌కు 4.20 లక్షల క్యూసెక్కుల నీటి రాక
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వర్షం కారణంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. కృష్ణానది ఎగువ నుంచి 3.72 లక్షల క్యూసెక్కులు, కర్నూలు పరిసర ప్రాంతా ల నుంచి 35 వేల క్యూసెక్కులు వస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. జూరాల నుంచి 3.89 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, శ్రీశైలం పరివాహక ప్రాంతాల నుంచి మరికొంత వరద తోడు కావడంతో జలాశయానికి 5,27,784 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
దీంతో అధికారులు పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి 4.04 లక్షల క్యూసెక్కులు, జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 68 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 587.90 అడుగులకు చేరింది. కుడికాల్వ ద్వారా 5292 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 12,261 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, 26 క్రస్ట్ గేట్ల నుంచి 4,97,524 క్యూసెక్కులు మొత్తంగా 5,16,877 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా, నాగార్జునసాగర్ నుంచి, వాగులు వంకల నుంచి పులిచింతలకు 6 లక్ష ల 57 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ మొత్తం నీటిని 21 గేట్లను ఐదు మీటర్ల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి ఏ క్షణంలోనైనా వరద ప్రవాహం 10 లక్షల క్యూ సెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2009 అక్టోబరు 5వ తేదీ రాత్రి 11 గంటలకు అత్యధికంగా 11,10,404 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో ఇదే రికార్డు. బ్యారేజీకి భారీ ప్రవాహం మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. ఆదివారం రాత్రికి బ్యారేజీ వద్ద 9.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ఎత్తివేత..
భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకూ వరద పోటెత్తుతోంది. శనివారం రాత్రి నుంచే మూసీ ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఐదు క్రస్ట్ గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 12,270 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 641.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు 5,800 క్యూసెక్కుల వరద వస్తుండగా, పైనుంచి వచ్చే ఉధృతిని గమనించి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. మూసీ నదిపై ఉన్న శాలిగౌరారం, కేతేపల్లి ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. మరోవైపు పాలమూరు జిల్లాలో భారీ వర్షాలకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మరోవైపు ఖమ్మం సమీపంలోని మున్నేరుకు భారీగా వరద చేరింది.
ఉదయం 22 అడుగులు ఉన్న మున్నేరు సాయంత్రం 36 అడుగులకు చేరింది. మున్నేరుకు ఇది రికార్డు స్థాయి వరదగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మున్నేరుకు వరద రావడంతో పరివాహక ప్రాంతాల్లోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, రఘునాధపాలెం, ఖమ్మం నగరం చింతకాని, ముదిగొండ, బోనకల్ తదితర మండలాల్లోని గ్రామాలు వేల ఎకరాల పంటలు జలమయయ్యాయి. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకూ క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 37,165 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 62.673 టీఎంసీలకు నీరు చేరింది. ప్రాజెక్టు నిండేందుకు ఇంకా 17 టీఎంసీలే అవసరం ఉండగా.. నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు, గోదావరి, మంజీరా ద్వారా వస్తున్న వరద నేపథ్యంలో.. ముందస్తుగా ప్రాజెక్టు వరద కాలువ గేట్లను ఎత్తి నీటిని మిడ్‌మానేరుకు విడుదల చేశారు.
నిజాంసాగర్‌కూ భారీగా వరద..
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సైతం భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టులోకి 15,600ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 285.75 మీటర్లకు చేరుకుంది. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పది వరద గేట్లను ఎత్తి దిగువకు 79,850 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 6.361 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 1,37,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండంతో 20 గేట్లు ఎత్తి 1,35,272 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు మూడు మోటార్ల ద్వారా 9,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కాగా, రాజన్న సిరిస్లి జిల్లా ఎగువ మానే రు ప్రాజెక్ట్ మత్తడి దూకుతోంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి 6,848 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా 7,075 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ఇక లోయర్ మానేరు డ్యాంలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మిడ్ మానేరు నుంచి 3వేల క్యూసెక్కులు, మోయతుమ్మెద వాగు నుంచి 39,047 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది.
ఏడుపాయల ఆలయం మూసివేత
మెదక్ జిల్లాలోని మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏడుపాయల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఘనపూర్ ఆనకట్ట, హల్దీ ప్రాజెక్టులు పొంగిపోరుతున్నాయి. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి దాటిన తర్వాత నిర్మిస్తున్న బ్రిడ్జి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తొగుట మండలం వెంకట్రావ్‌పేట వాగు గడ్డ వద్ద రోడ్డుపై నుంచి కూడవెళ్లి వాగు ప్రమాదకరంగా ప్రహించడంతో రోడ్డును మూసివేశారు. హుస్నాబాద్, పందిళ్ల వాగు పొంగిపోర్లడంతో తాత్కాలికగా వేసిన రహదారి తెగిపోగా హన్మకొండ-సిద్దిపేట రహదారిని మూసివేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్లవాగులోకి కూడా భారీగా వరద వస్తోంది. దీంతో పెద్దమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.