High Court: హత్య చేసినట్లు నిందితుడు అంగీకరిస్తే సరిపోదు
ABN , Publish Date - Aug 04 , 2024 | 04:20 AM
హత్య తానే చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక్కటే నేరనిర్ధారణకు సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నేరాంగీకార స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా సాక్ష్యాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఉండాలని పేర్కొంది.
స్పష్టమైన ఆధారాలు ఉండాలి
హైకోర్టు స్పష్టీకరణ
తల్లి హత్య కేసులో కుమారుడికి విముక్తి
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): హత్య తానే చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక్కటే నేరనిర్ధారణకు సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ నేరాంగీకార స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా సాక్ష్యాలు, స్వాధీనం చేసుకున్న ఆధారాలు ఉండాలని పేర్కొంది. కేవలం పోలీసుల ఎదుట ఇచ్చిన సీఆర్పీసీ 161 స్టేట్‌మెంట్లు, నేరాంగీకార స్టేట్‌మెంట్ ఆధారంగా హత్యను నిర్దారించలేమని తెలిపింది. 11 ఏళ్ల క్రితం జరిగిన 80 ఏళ్ల వృద్ధురాలైన తల్లి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడికి విముక్తి ప్రసాదిస్తూ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామానికి చెందిన కూలీ పెద్దగుండెల్లి పోచయ్య.. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న తల్లిని గొంతునులిమి హత్య చేశాడని, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంటివెనుక ఉన్న సీతాఫలం చెట్టుకు శవాన్ని వేలాడదీశాడనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోలేక టవల్‌తో గొంతునులిమి చంపినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.
దీనిపై విచారణ చేపట్టిన ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేట్ ఆరో అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా జస్టిస్ కే సురేందర్, జస్టిస్ జే శ్రీనివాసరావుల ధర్మాసనం సమగ్రంగా విచారణ చేపట్టింది. డాక్టర్ నివేదిక ప్రకారం గొంతుపై ఒత్తిడి వల్ల మరణం సంభవించింది. అయితే అది హత్య అయినాకావచ్చు లేదా ఆత్మహత్య అయినా కావచ్చని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం, డాక్టర్ సైతం సంశయాత్మకంగా నివేదిక ఇవ్వడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. పోలీసులకు నిందితుడు ఇచ్చిన నేరాంగీకార స్టేట్‌మెంట్ ఒక్కటే చెల్లదని, దానిని నిరూపించేలా తగిన ఆధారాలు ఉండాలని స్పష్టం చేస్తూ దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది. చట్టబద్ధమైన, అంగీకరించదగిన ఆధారాలు లేకుండా కేవలం ఊహ ఆధారంగా నేర నిర్ధారణ జరగదని, సహేతుకమైన సందేహాలనన్నింటినీ పటాపంచలు చేసేలా ప్రాసిక్యూషన్ కేసును నిరూపించాలని స్పష్టంచేసింది.