Share News

Hyderabad : ఫ్లాట్ల విలువ 15-30% పెంపు!

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:44 AM

రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కారు.. ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ, అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది.

Hyderabad : ఫ్లాట్ల విలువ 15-30% పెంపు!

  • సాగు భూములు, ప్లాట్ల విలువ 100ు పెంచే యోచన

  • రాష్ట్రవ్యాప్తంగా విలువల పెంపు ఖాయం!

  • ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన సర్కారు

  • స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అమల్లోకి?

  • ఏటా శాస్త్రీయంగా పెంచాలని నిర్ణయం!

  • 2023-24లో రిజిస్ట్రేషన్‌ శాఖ రాబడిలో

  • ఫ్లాట్ల నుంచే రూ.5,115 కోట్లు

  • మొత్తం ఆదాయంలో ఇది 35.1 శాతం!

  • ఆ తర్వాత స్థలాల నుంచి 22 శాతం

హైదరాబాద్‌, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కారు.. ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ, అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది. రాష్ట్రంలో ఏటా భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ విధానం శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15-30 శాతం, స్థలాల విలువను వంద శాతం వరకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

భూముల విలువ అమాంతం పెంచితే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొనుగోలుదారులకు, నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి.. ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా విలువలు పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి పదేపదే అధికారులకు సూచిస్తున్నారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను అన్వేషించడంతోపాటు కొత్త తలనొప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్‌ ధర రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున రూ.3200 ఉంటే దీన్ని 30 శాతం మించకుండా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రస్తుతం రూ.3200 ఉన్న చదరపు అడుగు ధరకు అదనంగా మరో రూ.960 పెంచి రూ.4160 చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రాంతాలను బట్టి ఈ విలువల్లో మార్పులు ఉంటాయి. చదరపు అడుగు రూ.1800 ఉన్న ప్రాంతాల్లో రూ.2500 దాటకుండా జాగ్రత్తలు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి చోట్ల చదరపు అడుగు రూ.10 వేలకు పైగా ఉంది. బ్యాంకు లోన్ల కోసం ఈ మొత్తం అధికారికంగా చూపుతున్న వారూ ఉన్నారు. అయితే ఇంత భారీగా పెంచితే క్యాపిటల్‌ గెయిన్‌, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయనుంది.


సాగు భూముల విలువలు రెట్టింపు?

వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి వంద శాతం పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గజం ధర రూ.1000 ఉంటే దాన్ని రూ.2 వేలకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదాహరణకు శేరిలింగంపల్లి రెండు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో ఉంది.

అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ రిజిస్ట్రేషన్‌ శాఖ పుస్తక విలువ ప్రకారం గజం ధర రూ.26,700 ఉంది. దీన్ని రూ.50-60 వేల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మహేశ్వరం లాంటి చోట్ల ఇప్పుడు ఉన్న విలువ రూ.3200ను రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెంచాలని భావిస్తోంది.

మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ మొత్తం ఆదాయంలో స్థలాల నుంచి 22 శాతం వస్తోంది. తమిళనాడులో 2012లో పెంచిన విలువలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. 2017లో అక్కడ భూముల విలువ పెంచగా ప్రజావ్యతిరేకత రావడంతో 2012 నాటి విలువలనే అమలు చేస్తున్నారు. తెలంగాణలో చివరిసారిగా 2021లో భూముల విలువలు పెంచారు.


ఈ ఏడాది లక్ష్యం రూ.18 వేల కోట్లు

ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్లది మూడో స్థానం. దీంతో ఈ శాఖలో ఏటా భూముల విలువలను పెంచేలా శాస్త్రీయ విధానాలను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.14588 కోట్ల ఆదాయాన్ని సముపార్జించగా, 2024-25లో రూ.18,229 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటి వరకు రూ.6080 కోట్లు ఆర్జించింది. ఇక ప్రభుత్వానికి వస్తున్న రాబడిలో క్రయవిక్రయాలకు సంబంధించి అత్యధికంగా ఫ్లాట్ల ద్వారా సమకూరుతోంది. 2023-24లో ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.5,115 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం రాబడిలో ఇది 35.1 శాతం. స్థలాల ద్వారా రూ.3322 కోట్లు, ఇళ్ల ద్వారా రూ.2838 కోట్లు, వ్యవసాయ భూములకు రూ.1668 కోట్లు, నాన్‌ రిజిస్టర్డ్‌ లావాదేవీల ద్వారా రూ.1645 కోట్ల ఆదాయం వచ్చింది.

Updated Date - Aug 28 , 2024 | 03:44 AM