Share News

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:47 AM

మేజర్‌ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్‌ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.

Hyderabad : గనుల వేలంపై వీడని చిక్కుముడి

  • రాష్ట్రం ప్రతిపాదించిన బ్లాకులకు వేలం అనుమతి కోసం నిరీక్షణ

  • స్పష్టతనివ్వని కేంద్రం..

  • సూర్యాపేటలోని 3 బ్లాకుల వేలానికి ఓకే

  • రాష్ట్ర నిర్ణయంపై సందిగ్ధత..

  • మరో 9 బ్లాకుల వేలం ప్రతిపాదనలెప్పుడు?

హైదరాబాద్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మేజర్‌ మినరల్స్‌కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్‌ మినరల్‌కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎంఎండీఆర్‌ (గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957ను 2023లో సవరణ చేశారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 10బి(2) ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రం అనుమతి పొందాల్సి ఉంది.

ఈ చట్టం ద్వారా మైనింగ్‌ రంగంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మైనింగ్‌కు సంబంధించి కార్యకలాపాలలో చట్టబద్ధత పారదర్శకత తీసుకొచ్చేలా సవరణలు చేశారు.

మైనింగ్‌, ఖనిజాల వెలికితీత, వాణిజ్య కార్యకలాపాలు కేంద్రం అధీనంలో చేపట్టే వెసులబాటు ఉంది. ఖనిజాల అన్వేషణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పోటీ బిడ్డింగ్‌ ద్వారా మంజూరు చేస్తుంది. ఖనిజాన్వేషణ అనుమతుల కోసం, వేలం విధానం, అందుకు సంబంధించిన నిబంధనలు, షరతులు, బిడ్డింగ్‌ పారామీటర్లు వంటి వివరాలను ఈ చట్టంలో చేసిన సవరణల ద్వారా కేంద్రం నిర్ణయిస్తుంది. ఏదైనా ఖనిజం వేలం వేయాలని నిర్ణయించినప్పుడు ఆరు నెలలలోపు రాష్ట్ర ప్రభుత్వం వేలం నిర్వహించాలనే నిబంధన సవరణ చేసిన చట్టంలో పొందుపరిచారు.


ఎందుకీ చిక్కు ముడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలేమితో కొన్ని గనుల వేలానికి సంబంధించి ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇటీవల ఢిల్లీలో గనులు, ఖనిజాల రంగంలోని పరిశ్రమల నిర్వాహకులతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఎంజీఎంఐ నిర్వహించిన జాతీయ సదస్సులో గనులు, ఖనిజాల రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన చర్చించారు.

ఈ రంగంలో సమూ ల మార్పులు తీసుకొచ్చి, దానిని పారదర్శకంగా, పోటీదాయకంగా మారుస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య గనుల వేలంపాట విషయంలో నెలకున్న చిక్కుముడి వీడటం లేదు. ఇప్పటికే మూడు గనుల వేలానికి సంబంధించి 2018 నుంచి ఈ వ్యవహారంపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇదే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకుంది. ఈ ఏడాది జూన్‌ 30తో గనుల వేలానికి కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు వైపులా దీనిపై ఎలాంటి వైఖరిని వెల్లడించడం లేదు.


మరో 9 గనుల విషయంలోనూ అదే జాప్యం

సూర్యాపేట జిల్లాలో 8 బ్లాకులు, నల్లగొండ జిల్లా పరిధిలో ఒక బ్లాకులో లైమ్‌స్టోన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అధికారులు 2024 ఫిబ్రవరి 3న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సవరణ చేసిన గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 10బి(2) కింద కేంద్ర గనుల శాఖ నుంచి వేలానికి సంబంధించిన అనుమతులు పొందాలని కోరారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఫిబ్రవరి నుంచి ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి.

అనుమతులు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లలేదు. ఈ అంశంపై రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఈ 9 బ్లాకుల వేలానికి అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


వేలం కోసం నిరీక్షణ

రాష్ట్రంలో మేజర్‌ మినరల్స్‌ వేలానికి సంబంధించి సూర్యాపేట జిల్లాలోని పశుపుల బోడు, సైదులనామ, సుల్తానాపూర్‌ బ్లాకుల కాంపోజిట్‌ వేలంపై రాష్ట్ర ప్రభుత్వం 2018లో కేంద్ర గనుల శాఖకు లేఖ రాసింది. 2021లో కేంద్రం వేలంపాటకు అనుమతి ఇచ్చింది. 2022 అక్టోబరు 10న, 24-1-2024న మరోసారి రాష్ట్ర మైనింగ్‌ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వేలం పాటకు అనుమతించాలంటూ ప్రతిపాదనలు పంపారు. కేంద్రం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాష్ట్ర గనుల శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయంపై గనుల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని.. తుది నిర్ణయం కోసం వేచి ఉన్నామని చెప్పారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం ప్రకారం కేంద్రం వేలం పాటు పాడే అధికారం ఉందన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 07:39 AM