Share News

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:23 AM

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్‌ ప్రూఫ్‌తోపాటు శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్‌ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్‌ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లను కొనుగోలు చేశారు.

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

  • విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్‌ క్రూయిజర్లు

  • రాష్ట్ర మంత్రులకు కేటాయించాలని సర్కార్‌ నిర్ణయం

  • బుల్లెట్‌ ప్రూఫ్‌, కొత్త సాంకేతిక కలిగిన కార్లు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్‌ ప్రూఫ్‌తోపాటు శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్‌ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్‌ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లను కొనుగోలు చేశారు. వాటికి బుల్లెట్‌ ప్రూఫ్‌తోపాటు, ఇతర సాంకేతిక వ్యవస్థను అమర్చడం కోసం విజయవాడలోని త్రిహాయని ఇంజనీరింగ్‌ వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తరలించారు. సాంకేతికతో పాటు అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఆ కార్లను ఇప్పుడు రాష్ట్ర మంత్రులకు కేటాయించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే వాహనాలు సిద్ధమై రావాల్సి ఉండగా పనుల్లో ఆలస్యం కారణంగా అవి అక్కడే ఉండిపోయాయి. అదనపు హంగుల పనులు పూర్తి కావడంతో త్వరలో కొత్త కార్లను విజయవాడ నుంచి హైదరాబాద్‌ తీసుకురానున్నారు. కొద్దిరోజుల క్రితమే కొత్త వాహనాలు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నా లోక్‌సభ ఎన్నికల హడావిడి, కోడ్‌ కారణంగా తీసుకురాలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో త్వరలో ఆ కార్లను హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నిఘా విభాగం అధికారులు విజయవాడ వెళ్లి కొత్త వాహనాల పనితీరును పరిశీలించి వచ్చారు. కాగా గత ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉపయోగించిన ల్యాండ్‌ క్రూయిజర్ల రంగు మార్చి.. వాటినే సీఎం రేవంత్‌ రెడ్డి వాడుతున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 06:39 AM