CM Revanth Reddy: ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 11 , 2024 | 08:49 AM
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘ఇందిరమ్మ ఇల్లు’’ పథకం కార్యరూపం దాల్చనుంది. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, ఖమ్మం/భద్రాచలం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘ఇందిరమ్మ ఇల్లు’’ పథకం కార్యరూపం దాల్చనుంది. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం దీనికి వేదిక కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇల్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసింది. కాగా, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను కూడా సోమవారం ప్రకటించనున్నారు. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను సర్కారు సిద్ధం చేసింది. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ దశలవారీగా వర్తింపజేయనున్నారు. స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, లేనివారికి స్థలం ఇచ్చి రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో మంజూరు చేస్తారు. ఈ ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను మంజూరు చేయగా.. రిజర్వ్ కోటా (సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి)లో మరో 33,500 కేటాయించారు. మొత్తంగా 4.50లక్షల ఇళ్లు మంజూరు కానున్నాయి. తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి అందనుండగా.. స్థలం లేనివారికి రెండో దశలో పథకాన్ని వర్తింపజేస్తారు. ఇంటి నిర్మాణం విషయంలో లబ్ధిదారుదే పూర్తి నిర్ణయం అయినప్పటికీ.. ఆర్‌సీసీ స్ట్రక్చర్‌తో పాటు కచ్చితంగా వంట గది, బాత్‌రూమ్ ఉండాలి. అనంతరం ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం కింద నిర్మించినదని తెలిసేలా ‘అభయహస్తం’ లేదా ప్రత్యేకంగా తయారు చేసే కొత్త లోగోను ఉంచనున్నారు. కాగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల విషయంలో చేసిన తప్పులు ఈసారి జరగకుండా, అర్హులకే పథకం అందేలా మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ పథకానికి అర్హులైన వారు దాదాపు 30–40 లక్షలమంది ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల ఆన్‌లైన్ పూర్తయ్యాక హెచ్చుతగ్గులు ఉండొచ్చని కూడా భావిస్తోంది. దరఖాస్తులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేయడంతో పాటు అవసరమైతే గ్రామసభల్లోనూ మరోసారి పరిశీలించనున్నారు. గ్రామ సభల్లో వివరాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రొఫార్మాను రూపొందించింది.
పథకం కోసం రుణం..
ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనుంది. ఎన్ని ఇళ్లను ఏయే దశల్లో నిర్మిస్తామనే వివరాలను కూడా తెలిపింది. తొలి శలో గ్రామీణ ప్రాంతాల్లో 57,141, పట్టనాల్లో 38,094 ఇళ్లను నిర్మిస్తామని పేర్కొంటూ ఈ నె 5న జీవో విడుదల చేసింది. దీనిప్రకారం నియోజకవర్గానికి 800 ఇళ్లు అందనున్నట్టు తెలుస్తోంది. ఈ గణాంకాలు, అంచనాలు హడ్కో రుణం కోసం సంబంధించినవేనని సమాచారం. వీటికి మరికొన్ని కలిపి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుంది. ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని మహిళ పేరు మీద అందిస్తారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా నిర్మాణాలను పర్యవేక్షిస్తారు. లబ్ధిదారుకి రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొంది ఉంటే అనర్హులు. మంజూరైన ఇళ్ల కంటే లబ్ధిదారులు ఎక్కువ ఉంటే.. వారికి మరో విడతలో అందిస్తారు.
సీఎం భద్రాచలం పర్యటన షెడ్యూల్ ఇది
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12:10 గంటలకు భద్రాచలం రాముడిని దర్శించుకోనున్నారు. 1:30కు వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటుచేసిన సభలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రారంభిస్తారు. 2:30 నుంచి 3:30 మధ్య భద్రాచలం ఆలయం, సాగు నీటి, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమై సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరులో సభకు హాజరవుతారు. 6:10 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.
భద్రాచలం రామాలయం అభివృద్ధిపై ఆశ
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భద్రాచలం వచ్చిన రేవంత్.. అధికారంలోకి వస్తే ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం హోదాలో ఇప్పుడు భద్రాద్రి అభివద్ధికి వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధికి రూ.100కోట్లు ప్రకటించినా రూపాయీ ఇవ్వలేదు.
అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా హామీలు నెరవేరుస్తున్నాం: తుమ్మల
ఖమ్మంకార్పొరేషన్: ప్రజల సొమ్ము దోచుకోవటమే ధ్యేయంగా పనిచేసిన గత ప్రభుత్వం తమకు అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో సాహసంతో ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బూడిదెంపాడు వద్ద రూ.38.50 కోట్లతో ఖమ్మం–ఇల్లెందు రెండులైన్ల రహదారి నాలుగులైన్లుగా విస్తరణ, అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. సోమవారం భద్రాద్రి రాముడి సన్నిధిలో సీఎం రేవంత్‌రెడ్డి ఐదో గ్యారెంటీగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. శ్రీశైలం, సాగర్‌లో నీళ్లు లేకపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాలే కారణమన్నారు.