Siva Balakrishna Case: శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు
ABN , Publish Date - Feb 16 , 2024 | 09:30 AM
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని..
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో అతని బినామీలను ఏసీబీ విచారిస్తోంది. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు.
వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని, పలువురు రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల దుశ్చర్యకు పాల్పడ్డారని.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివ బాలకృష్ణ హెచ్ఎండీఏలో పనిచేస్తున్నారు. భూములు వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలని రియల్టర్లకు చేరవేశారు. హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.
ఇదిలాఉండగా ఇప్పటికే శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది.