Share News

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:13 PM

హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

సికింద్రాబాద్, అక్టోబర్ 20: హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

Also Read: HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు


దీంతో ఆర్టీసీ డ్రైవర్ల నుంచి పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. అలాగే ముత్యాలమ్మ దేవాలయం వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళు, వాటర్ బాటిల్స్, చెప్పులు విసిరారు. ఈ ఘటనపై సబ్ ఇన్స్‌పెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో 195,192,121,132,299 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా మెట్రో పోలీస్ హోటల్‌పై దాడి వ్యవహారంలో హోమ్ గార్డ్ ఫిర్యాదు చేశారు. దాంతో 189,191,195,126,132 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఇక రెజిమెంటల్ బజార్ రహదారిలో ఆర్టీసి బస్సులపై దాడి నేపథ్యంలో పోలీసులకు డ్రైవర్లు పిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఐదు కేసుల్లో హిందూ సంఘాల వారిని పోలీసులు నిందితులుగా చేర్చారు.


అక్టోబర్ 14వ తేదీన కుమ్మరిగూడలోని ఆలయంలోనికి ముంబయికి చెందిన వ్యక్తి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. స్థానికులు వెంటనే అతడి పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. దాంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. హిందూ సంఘాలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సికింద్రాబాద్‌లోని హోటళ్లు, దుకాణాలు స్వచ్చంధంగా మూసి వేశారు.


ఇక మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు వివిధ హిందూ సంఘాలు నేతలు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని హనుమాన్ చాలీసాను పఠించారు. అనంతరం వారంతా అక్కడి నుంచి ర్యాలీగా కుమ్మరిగూడలోని ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఆ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.


దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్ళు, వాటర్ బాటిల్స్, చెప్పులు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు లాఠీ ఛార్జీకి దిగారు. పలువురు నిరసనకారులు గాయపడగా.. రాళ్ల దాడిలో పోలీసులకు సైతం స్వల్పంగా గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని యువకులు సైతం అక్కడకు చేరుకుని తమ నిరసన తెలిపారు. అందులోభాగంగా వారంతా అక్కడే భోజనాలు చేశారు. ఇక విగ్రహం ధ్వంసం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడు బస చేసిన హోటల్‌ సైతం సీజ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

For Telangana News And Telugu News..

Updated Date - Oct 20 , 2024 | 03:15 PM