jeedimetla: మోసపోయా.. అమ్మానాన్న నన్ను క్షమించండి
ABN , Publish Date - May 31 , 2024 | 04:10 AM
‘‘ మంచివాడని నమ్మి మోసపోయా.. అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నడిరోడ్డులో వాడు నన్ను తిట్టినా, కొట్టినా ఎనిమిదేళ్లుగా పడ్డా.. డిగ్రీ చదివిన నేను చదువులేనోడని తెలిసినా వాడిని ప్రేమించా.. కానీ వాడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు.
ఎనిమిదేళ్లు నరకం చూశా.. బాధలు భరించలేకున్నా
ప్రేమించి మోసపోయానంటూ యువతి ఆత్మహత్య
జీడిమెట్ల, మే 30(ఆంధ్రజ్యోతి): ‘‘ మంచివాడని నమ్మి మోసపోయా.. అమ్మానాన్న.. నన్ను క్షమించండి. నడిరోడ్డులో వాడు నన్ను తిట్టినా, కొట్టినా ఎనిమిదేళ్లుగా పడ్డా.. డిగ్రీ చదివిన నేను చదువులేనోడని తెలిసినా వాడిని ప్రేమించా.. కానీ వాడు రూ.70 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆంక్షలు పెట్టి చివరికి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. ఈ మోసాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వాడిలో మార్పు రాకపోగా రాత్రింబవళ్లు ఫోన్లు చేసి వేధిస్తూ నరకం చూపించాడు. ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.
మరో అమ్మాయి ఈ దుర్మార్గుడికి బలి కాకుండా చూడండి. పోలీసులు, కోర్టులు వాడిని శిక్షించకపోయినా ఆ దేవుడు తగిన శిక్ష వేస్తాడని నమ్ముతున్నా..’’ ప్రేమించి మోసపోయానంటూ ఈ నెల 28వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకున్న గాజులరామారం రోడ్డులోని ఎన్ఎల్బినగర్కు చెందిన బాలబోయిన అఖిల(22) రాసిన సూసైడ్ నోట్ సారాంశం ఇది. జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని అదే ప్రాంతానికి చెందిన ఓరుగంటి వెంకటేష్ గౌడ్ కుమారుడు, ప్రస్తుతం ఎన్ఎల్బినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అఖిల్సాయిగౌడ్ ఆమెను మోసగించాడు. ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ అఖిలకు దగ్గరైన అఖిల్ చివరికి ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు.
అఖిల ఆత్మహత్య చేసుకోవడంతో అఖిల్ సాయిగౌడ్ కుటుంబం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అఖిల అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. అయితే, అఖిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు, స్థానిక యువత గురువారం రాత్రి కాలనీలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. అఖిల్సాయిగౌడ్ను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే అఖిల్సాయిగౌడ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.