Share News

KTR: రుణమాఫీపై చర్చకు సీఎం రావడం లేదు..

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:43 AM

‘రుణమాఫీపై చర్చించేందుకు రమ్మంటే సీఎం రేవంత్‌రెడ్డి రావడం లేదు. ఆయన భాషలో చెప్పాలంటే.. మగాడివైతే పల్లెల్లోకి రా.. పోలీస్‌ భద్రత లేకుండా వస్తే అసలు విషయం తెలుస్తుంది.

KTR: రుణమాఫీపై చర్చకు సీఎం రావడం లేదు..

  • ప్రజలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ రేవంత్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి)/వంగూరు: ‘రుణమాఫీపై చర్చించేందుకు రమ్మంటే సీఎం రేవంత్‌రెడ్డి రావడం లేదు. ఆయన భాషలో చెప్పాలంటే.. మగాడివైతే పల్లెల్లోకి రా.. పోలీస్‌ భద్రత లేకుండా వస్తే అసలు విషయం తెలుస్తుంది. ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ సీఎం రేవంత్‌’ అని కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులపైౖ కాంగ్రెస్‌ శ్రేణుల దాడులు, యూట్యూబర్లపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


ఈ మేరకు శుక్రవారం కేటీఆర్‌ డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌ రెడ్డి, ముఠా గోపాల్‌, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేష్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని.. ఒకవేళ తాము ప్రతిఘటిస్తే నిందించవద్దని హెచ్చరించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టగా.. 50 మంది కాంగ్రెస్‌ గూండాలు రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని ఆరోపించారు.


రుణమాఫీ అయ్యిందా? లేదా అని తెలుసుకోవటానికి సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా యూట్యూబర్లపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేశారన్నారు. ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారని.. వారికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలు కూల్చాలన్నారు. కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి, వివేక్‌, కేవీపీ, మధుయాష్కీ వంటి నేతల భవనాలను కూల్చేశాక సామాన్యుల భవనాలను కూల్చేయాలన్నారు. కాగా, మహిళా యూట్యూబర్లపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీయూడబ్ల్యూజే నేతలు కూడా ఫిర్యాదు చేశారు.


  • కొండారెడ్డిపల్లి ఘటనపై కేసులు నమోదు

కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా యూట్యూబర్లను అడ్డుకున్న ఘటనలో శుక్రవారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కృష్ణ, వంశీ, అనిల్‌, చందు, మల్లేపాకుల శేఖర్‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తల ఫిర్యాదు మేరకు యూట్యూబర్‌ విజయారెడ్డితో పాటు మరో నలుగురిపై కౌంటర్‌ కేసులు నమోదు చేశామన్నారు. కాగా, మహిళా యూట్యూబర్లపై దాడి వివరాలు అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద పోలీసులను ఆదేశించారు. ఈమేరకు నాగర్‌కర్నూలు ఎస్పీకి లేఖ రాశారు.

Updated Date - Aug 24 , 2024 | 03:43 AM