KTR: లోగోలు కాదు.. బతుకులు మార్చండి!
ABN , Publish Date - May 31 , 2024 | 05:26 AM
రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి చార్మినార్, కాకతీయ కళాతోరణాలు ప్రతీకలని చెప్పారు. చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని, కాకతీయ కళాతోరణం తీసేయడమంటే వరంగల్ చరిత్రను అగౌరవపర్చినట్లేనని తెలిపారు.
చార్మినార్ తొలగింపు హైదరాబాదీలను అవమానించడమే
కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపర్చినట్లే
మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి రాజముద్ర మార్పు వద్దు.. లేదంటే
రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతాం చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్
హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి చార్మినార్, కాకతీయ కళాతోరణాలు ప్రతీకలని చెప్పారు. చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని, కాకతీయ కళాతోరణం తీసేయడమంటే వరంగల్ చరిత్రను అగౌరవపర్చినట్లేనని తెలిపారు. ‘లోగోలు కాదు.. ప్రజల బతుకులు మార్చాలి. జనం ఎన్నుకున్నదే అందుకనే విషయాన్ని పాలకులు గుర్తించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజముద్ర మార్పు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్ తదితరులతో కలిసి ఆయన చార్మినార్‌ను సందర్శించారు.
త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండగ వాతావరణంలో జరగాలన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌కు పేరు రాకూడదని, ఆయన పేరు వినిపించకూడదన్న రాజకీయ కక్షతో మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ‘ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నించండి. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి’ అని హితవు పలికారు. రాజముద్రలో చార్మినార్, కళాతోరణాలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు 400 ఏళ్లు పూర్తయినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని, ఇప్పుడు హైదరాబాద్ ప్రతీక లేకుండా చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు చరిత్ర తెలియదు..
రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ బాసులకు తలూపడం మినహా.. సీఎంకు హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి తెలియదని ఎద్దేవా చేశారు. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టడం వల్ల అమరుల తల్లిదండ్రులు సంతోషించరన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, వేలాది మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకుందని ఆరోపించారు. కాకతీయుల వైభవాన్ని గుర్తించిన ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్‌పై కాకతీయ కళాతోరణాన్ని పెట్టించారని గుర్తు చేశారు. రాజముద్ర మార్పుపై సర్కారు నిర్ణయం మార్చుకోకపోతే నిరసనలు చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.