Share News

Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:54 AM

త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

  • కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తాం

  • బీఆర్‌ఎ్‌సది అసత్య ప్రచారం: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌

  • కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడి

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కువ కాలం పొడగించడం కుదరదని, అందుకే కుల గణన కోసం నియమించిన కమిషన్‌కు రెండు నెలల సమయమే ఇచ్చామని గుర్తు చేశారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ప్రజలను బీఆర్‌ఎస్‌ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సాంకేతిక సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయని, వాటినీ త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.


పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన రుణమాఫీ ఎంత? తొమ్మిది నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రుణమాఫీ ఎంత? చర్చకు సిద్ధమేనా? అని హరీశ్‌రావును ప్రశ్నించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన బీఆర్‌ఎస్‌... ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాతె పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నిజామాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులందరం సీఎంను కలిసి పారిశ్రామిక అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:54 AM