Share News

Family Dispute: మంచు ఫైటింగ్స్‌లో శాంతి ఎపిసోడ్‌!

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:46 AM

సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం.. దాడులు, ఘర్షణల నుంచి కొంత శాంతించింది. ఇంటి రచ్చను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Family Dispute: మంచు ఫైటింగ్స్‌లో శాంతి ఎపిసోడ్‌!

మోహన్‌బాబు కుటుంబ సమస్య పరిష్కారానికి సన్నిహితుల ప్రయత్నం!

  • సీపీ ఎదుట మనోజ్‌, విష్ణు హాజరు

  • మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌, విజయ్‌ అరెస్టు

  • మీడియాకు క్షమాపణలు: మనోజ్‌

  • మమ్మల్ని అమితంగా ప్రేమించడమే నాన్న తప్పు: విష్ణు

  • మోహన్‌బాబుకు ఇంకా రెండు రోజులు చికిత్స అవసరం: వైద్యులు

  • ఇన్‌స్టాలో మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం

హైదరాబాద్‌/సిటీ/పహాడీషరీ్‌ఫ/రాయదుర్గం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం.. దాడులు, ఘర్షణల నుంచి కొంత శాంతించింది. ఇంటి రచ్చను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమ కుటుంబ సన్నిహితులతో మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు మాట్లాడినట్లు, దీంతో వారు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌బాబు కుటుంబ సభ్యుల రచ్చను పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. బుధవారం ఆయన కుమారులు మనోజ్‌, విష్ణు ఇద్దరినీ వేర్వేరుగా పిలిచి విచారించారు. మరోవైపు మనోజ్‌ ఫిర్యాదు ఆధారంగా మోహన్‌బాబు మేనేజర్‌ వెంకటకిరణ్‌ను అరెస్టు చేశారు. కాగా, అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని చెప్పారు. మరోవైపు మోహన్‌బాబు కుమార్డె మంచు లక్ష్మి ‘పీస్‌’ అంటూ ‘ఎక్స్‌’లో శాంతి మంత్రాన్ని పఠించగా.. అన్నదమ్ములు విష్ణు, మనోజ్‌ ఇద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తన తండ్రి దేవుడని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి ఇతరులు ఇవన్నీ చేయిస్తున్నారని మనోజ్‌ అన్నారు. మీడియా ప్రతినిధులపై దాడికి సంబంధించి తన తండ్రి తరఫున తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. కాగా, మీడియాపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని విష్ణు అన్నారు. తమ కుటుంబ వివాదాన్ని మీడియా ఇంతటితో వదిలేయాలని కోరారు.


  • గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు..

మంచు మనోజ్‌ బుధవారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. దీంతో కుటుంబ సమస్యను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని, గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలుంటాయని సీపీ స్పష్టం చేశారు. సీపీ ఆదేశంతో.. ఇకపై ఎలాంటి గొడవలకు వెళ్లనంటూ మనోజ్‌ రూ.లక్ష పూచీకత్తు సమర్పించారు. బయటకు వచ్చిన తర్వాత మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనకు నాన్నంటే ప్రాణమని, ఆయన దేవుడి లాంటి వారని అన్నారు. ఇప్పుడు చూస్తున్నది తన తండ్రి వ్యక్తిత్వం కాదని అన్నారు. తన అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందన్నారు. కాగా, పిల్లల్ని అమితంగా ప్రేమించడమే తన తండ్రి చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది తమ కుటుంబవిషయమని, ఈ విషయంలో భాగమైన బయటవాళ్లు వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. మధ్యాహ్నం రాచకొండ సీపీ ఎదుట విష్ణు హాజరయ్యారు.


  • మోహన్‌బాబుపై కేసు..

మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఘటనలో మోహన్‌బాబుపై పహాడీషరీఫ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన ఇంటి వద్ద ఉన్న బౌన్సర్లను బైండోవర్‌ చేయించారు. ఇదిలా ఉండగా.. మోహన్‌బాబుకు బీపీ ఎక్కువగా ఉందని, మెడ నొప్పి, కాళ్ల నొప్పి తీవ్రంగా ఉన్నాయని కాంటినెంటల్‌ ఆస్పత్రి బులెటిన్‌లో పేర్కొంది. ఒంటిపై కూడా కొన్ని గాయాలున్నాయని, కంటి కింద వాపు ఉందని తెలిపింది. రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామంది. మరోవైపు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పీస్‌ (శాంతి) అంటూ కామెంట్‌ పెట్టారు. ఈ పోస్టుకు మనోజ్‌ భార్య మౌనిక లైక్‌ కొట్టారు.


  • మోహన్‌బాబుపై కేసు..

మీడియాపై దాడి చేసిన మోహన్‌బాబును మా అసోసియేషన్‌ నుంచి తొలగించడంతోపాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్‌ చేశాయి. బుధవారం ఫిల్మ్‌ చాంబర్‌ వద్ద మీడియా ప్రతినిఽధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు జర్నలిస్టులు రాచకొండ కమిషనరేటట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

Updated Date - Dec 12 , 2024 | 03:46 AM