Nagarjuna Sagar project : అర అడుగే తక్కువ!
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:44 AM
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
589.50 అడుగులకు సాగర్ నీటి మట్టం
చురుగ్గా తుంగభద్ర స్టాప్‌లాగ్ పనులు
హైదరాబాద్, గద్వాల, నాగార్జున సాగర్, ఆగస్టు 13: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 68,453 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
కాగా, ఆల్మట్టికి 30,648 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 15 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌కు 15 వేల ఇన్‌ఫ్లో వస్తుండగా జల విద్యుత్ ఉత్పత్తితో 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల 8.83 టీఎంసీలకు చేరింది. 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గేట్లను మూసివేయడంతో పాటు జల విద్యుత్ ఉత్పత్తిని కూడా నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 97 వేల క్యూసెక్కులు విడిచి పెడుతున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వ 881 అడుగుల (193.40 టీఎంసీలు)కు పెరిగింది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి 68,453 క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు.
తుంగభద్ర ‘స్టాప్‌లాగ్’లో 60 మంది
తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాజెక్టు బోర్డు, ఏపీ, కర్ణాటక అధికారులు, 60 మంది నిపుణులు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రాజెక్టు గేట్ల నిపుణుడు, సలహాదారు కన్నయ్యనాయుడి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. స్టాప్‌లాగ్‌ను ఐదు సెగ్మెంట్లుగా తయారు చేస్తున్నారు. ఒక్కోటి 60 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తు, 13 టన్నుల బరువు చొప్పున మొత్తం 20 అడుగుల ఎత్తు, 65 టన్నుల బరువుంటుంది. వారాంతంలో భారీ వర్షాలు కురవొచ్చని.. 3-4 రోజుల్లోనే గేటు అమర్చాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సూచించారు.