Share News

Budget Allocation: 2 లక్షల క్యాటగిరికే ఎక్కువ బడ్జెట్‌!

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:53 AM

రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. రెండు లక్షల రుణమాఫీ చేయటానికి మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలివిడతలో లక్ష వరకు మాఫీ చేయటానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారు.

Budget Allocation: 2 లక్షల క్యాటగిరికే ఎక్కువ బడ్జెట్‌!

  • 3వ విడతకు రూ. 18 వేల కోట్లు

  • రుణమాఫీ బడ్జెట్‌లో 60 శాతం దానికే

  • ఏకంగా 18 వేల కోట్లు సర్దాల్సిందే

  • ‘లక్షన్నర’ మాఫీ కోసం మరో 7 వేల కోట్లు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. రెండు లక్షల రుణమాఫీ చేయటానికి మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలివిడతలో లక్ష వరకు మాఫీ చేయటానికి రూ. 6,100 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 25 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంది తొలి విడతతో పోలిస్తే... మూడో విడతలో భారీ ఎత్తున నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. దాదాపు 60 శాతం బడ్జెట్‌ రూ.2లక్షల కేటగిరిలో ఉన్న రైతులకే చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన మూడో విడత రుణమాఫీకి రూ.18 వేల కోట్లు, రెండో విడతకు రూ.7 వేల కోట్ల నిధులు అవసరం పడుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన నివేదిక ప్రకారం.. 40 బ్యాంకులు, 5,782 శాఖల్లో 41,78,892 లోనింగ్‌ అకౌంట్లు ఉన్నాయి. గత 2023 డిసెంబరు నెల తొమ్మిదో తేదీ నాటికి ఈ ఖాతాలపై రూ. 42,956 కోట్ల అప్పు ఉండటం గమనార్హం. వీటిలో ఆధార్‌ లేనివి, ఆధార్‌తో సరిపోల్చని ఖాతాలు 1,47,293 ఉన్నాయి. వీటిపై రూ. 1,745 కోట్ల పంట రుణ బకాయిలు ఉన్నాయి. లోన్‌ అకౌంట్‌ ఎర్రర్‌ ఉన్న బ్యాంకు ఖాతాలు 2,93,632 ఉన్నాయి. వీటిపై రూ. 2,190 కోట్ల పంటరుణాలు ఉన్నాయి. ఇవిపోగా 38,85,260 లోనింగ్‌ అకౌంట్లు సజావుగా ఉన్నాయి. వీటిపై రూ. 40,765 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. ఇందులో రెండు లక్షల రుణమాఫీ పథకానికి అర్హత పొందే రైతులకు రూ. 31 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి.


ఈ రూ. 31 వేల కోట్లలో తొలివిడతలో రూ. 6 వేల కోట్లు పంపిణీచేశారు. రుణమాఫీకి ఇంకా రూ. 25 వేల కోట్లు కావాలి. రెండో విడతకు రూ.7 వేల కోట్లు, మూడో విడతకు రూ.18 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. మూడో కేటగిరీలో రూ. 2 లక్షల వరకే అప్పు ఉన్న రైతులతోపాటు... రూ.2 లక్షలకు మించి అప్పు ఉన్న రైతులు కూడా ఉంటారు. అంటే రూ. 3 లక్షలున్న రైతులు, రూ.4 లక్షలు తీసుకున్న రైతులు, అంతకంటే ఎక్కువ అప్పు తీసుకున్న రైతులు కూడా ఉంటారు. ఎన్ని లక్షల అప్పు ఉన్నా... అర్హులైనవారికి రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయాల్సి ఉంటుంది.


ఈలెక్కన రూ. 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులు కూడా మూడో విడత రుణమాఫీలోకి వస్తారు. ఈ క్రమంలో మొదటి విడత, రెండో విడత కంటే మూడో విడత బడ్జెట్‌ గణనీయంగా పెరుగుతుంది. రుణమాఫీకి మొత్తం బడ్జెట్‌ రూ. 31 వేల కోట్లు అయితే... ఇందులో 60 శాతం అంటే... సుమారు రూ. 18వేల కోట్లు మూడో విడత రుణమాఫీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రైతుల నుంచి వచ్చే అర్జీలు, సవరణలతో పెరిగే రైతుల సంఖ్య, నిధుల మొత్తం కూడా మూడో విడత బడ్జెట్‌లో జమ అవుతుంది.


అసలుకు వడ్డీ, వడ్డీలకు వడ్డీ పెరగడంతోనే

2018లో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. ఫలితంగా రైతులకు అసలుకు వడ్డీ, వడ్డీలకు వడ్డీ పెరిగిపోయి.. వారి కేటగిరీ మారింది. లక్షకులోపు అప్పు తీసుకున్న రైతుల్లో కొందరు లక్షన్నర కేటగిరీలోకి, మరికొందరు రెండు లక్షల కేటగిరీలోకి వెళ్లిపోయారు. అందుకే రెండు, మూడో విడతలకు కలిపి సుమారు రూ. 25 వేల కోట్ల బడ్జెట్‌ సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దీనికితోడుగా రుణపరిమితి పెరగడంతో అప్పు పెరిగింది.

Updated Date - Jul 19 , 2024 | 02:53 AM