Krishna River: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:21 AM
కృష్ణా, భీమా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సోమవారం 1,32,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
8 శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్ ఫ్లో
8 నేడు, రేపు అక్కడక్కడా మోస్తరు వర్షాలు
8 29, 30న పలు జిల్లాల్లో భారీ వానలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కృష్ణా, భీమా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సోమవారం 1,32,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1,30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను 127.1 టీఎంసీల నీరు ఉంది. నారాయణపూర్ జలాశయానికి 1,23,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 1,30,000 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది.
జలాశయం సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా 36.9 టీఎంసీల నీరు ఉంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1,20,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం నుంచి 1,21,978 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను 7.85 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,32,281 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా76,052 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా నీటి నిల్వ 210.03 టీఎంసీలకు చేరింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 66,051 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.4 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 49,338 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇక, గోదావరి బేసిన్‌లో కాళేశ్వరం వద్ద గల మేడిగడ్డ బ్యారేజీలోకి 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరుతుండగా.. 85 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 24వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరుకు నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
31దాకా రాష్ట్రానికి యెల్లో అలర్ట్..
రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 31 వరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 29న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 30న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.