Loan waiver: రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Aug 17 , 2024 | 03:08 AM
రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి.. మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం..
ఆధార్ తప్పుంటే.. ఓటర్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్‌లోడ్
రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే
ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే.. సరిచేసి పోర్టల్‌లో నమోదు
అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు
ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ.. కొత్తగా మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి.. మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం.. ఆధార్ కార్డుల్లో తప్పులుండటం.. బ్యాంకు-ఆధార్ వివరాల్లో తేడాలుండటం.. పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవటం.. అసలు-వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండటం కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత జూలై 15న జారీచేసిన జీవో నంబరు 567కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీచేసింది.
ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు, సూచనలు జారీచేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు (ఎంఏవో) అప్పగిస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఆదేశాలు జారీచేశారు. ఆదేశాల్లో భాగంగా.. ఏవోలు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలి. తప్పులు సరిచేసి క్రాప్ లోన్ వీవర్ (సీఎల్‌డబ్ల్యూ) పోర్టల్ ఠీఠీఠీ.ఛిజూఠీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ లో నమోదుచేయాలి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య, రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశాలు జారీచేశారు. ఆధార్ కార్డు తప్పుగా ఉంటే... రైతుల వద్దకు వెళ్లి ఆధార్ కాపీ మళ్లీ తీసుకోవాలి. పోర్టల్‌లో సరైన ఆధార్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
ఓటరు కార్డు, వాహన లైసెన్సు, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోతే.. మండల వ్యవసాయ అధికారి రైతుల ఇంటికి వెళ్లాలి. రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు, కుటుంబసభ్యుల సంఖ్యను తప్పనిసరిగా తీసుకోవాలి. రైతు కుటుంబాన్ని నిర్ధారించి వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. రైతుకు పట్టాదారు పాస్‌బుక్ లేదని పోర్టల్‌లో చూపిస్తే... రైతు నుంచి పట్టాదార్ పాస్‌బుక్ తీసుకొని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఆధార్ పేరు, లోన్ ఖాతా పేరు మధ్య లోపాలుంటే.. ఆధార్ కార్డులో రైతు పేరు, లోన్ ఖాతాలో పేరు మధ్య లోపాలు, అసమతుల్యత ఉన్న సందర్భాల్లో రుణం తీసుకున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారణ చేయాలి. రుణం తీసుకున్న వ్యక్తి సరైన ఆధార్ నంబరును పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అసలు, వడ్డీ మొత్తం లెక్కల్లో తేడాలొస్తే రైతు నుంచి ఒక దరఖాస్తును తీసుకోవాలి. అప్పు ఎంత తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? వడ్డీ ఎంత అయింది? అసలు- వడ్డీ కలిపి ఎంత అయింది? అనే వివరాలను పేర్కొంటూ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. నిర్ధారణ, దిద్దుబాటు కోసం సంబంధిత బ్యాంకులకు వివరాలను పంపించాలి.
2 లక్షలకు మించినవారికి 4వ విడతలో
రుణమాఫీలో భాగంగా ఇక రూ. 2 లక్షలకు మించి బకాయిలు ఉన్న రైతులకు గరిష్ఠంగా రూ.2లక్షల వరకు నాలుగో విడతలో మాఫీచేస్తారని తెలిసింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే... ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు తొలుత చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను మాఫీ చేస్తుంది. అయితే రైతులు 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని ఎప్పటిలోగా చెల్లించాలి? అనే విషయంలో స్పష్టతనివ్వలేదు. దీనిపై క్యాబినెట్‌లో చర్చించినిర్ణయం తీసుకుంటారని సమాచారం.