Share News

Farmer Protest: మాఫీలో ఆంక్షలొద్దు

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:10 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్‌ మండలంలోని రైతులకు ఇప్పటి వరకు అందలేదు.

Farmer Protest: మాఫీలో ఆంక్షలొద్దు

  • ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆందోళన

  • ఘట్‌కేసర్‌ రైతు సేవా సహకార బ్యాంక్‌ నుంచి 1,230 మంది రైతుల రుణం

  • ఒక్క రైతు కు కూడా రుణ మాఫీ కాలే..

  • వివరాలు ఆఫ్‌లైన్‌లో.. అందరికీ మాఫీ: అధికారులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆదిలాబాద్‌ రూరల్‌/ ఆర్మూర్‌ రూరల్‌/పిట్లం, మల్లాపూర్‌, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్‌ మండలంలోని రైతులకు ఇప్పటి వరకు అందలేదు. ఇప్పటిదాకా మూడు విడతల ప్రక్రియ పూర్తయినా మాఫీ ఎప్పుడెప్పుడా అని ఆ రైతులు ఎదురుచూస్తున్నారు. ఘట్‌కేసర్‌ మండలంలో ప్రధానంగా రైతు సేవా సహకార సంఘం నుంచే రైతులు పంట రుణాలు తీసుకుంటారు. ఆ బ్యాంక్‌లో 1,230 మంది అన్నదాతలు రూ. 9కోట్ల మేరకు పంట రుణం తీసుకున్నారు. మరో 54మంది స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియాలో 92 లక్షల పంటరుణం తీసుకున్నారు.


ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ సర్కారు గత నెల 18వ తేదీ నుంచి మూడు దశల్లో రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఘట్‌కేసర్‌ రైతుల్లో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ అప్‌ ఇండియాలో 54 మందికి గాను రెండు దశల్లో 46 మందికి రూ.52 లక్షల మేరకు రుణమాఫీ అయింది. ఘట్‌కేసర్‌ సహకార బ్యాంకులో రుణం తీసుకున్న అన్నదాతలంతా రైతు సేవా సహకారం సంఘం, బ్యాంకుల చుట్టూ తిరుగతున్నారు. అయితే బ్యాంకులో ఆడిట్‌ జరుగుతుందని, త్వరలో రుణమాఫీ అవుతుందని అధికారులు చెబుతూ వస్తున్నారు.


రుణమాఫీ కాకపోవడంతో పంటల సాగు కోసం బయట అప్పుల చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ కాలేదంటూ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో రైతులు సోమవారం ఆందోళన కొనసాగించారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఇంద్రవెల్లి మండలంలోని ధన్నూర్‌.. బజార్‌హత్నూర్‌ మండలంలోని పిప్రి, ఇచ్చోడకు చెందిన రైతులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. కలెక్టర్‌ రాజార్షి షాను కలిసి తమ సమస్యను విన్నవించారు. వెంటనే తమకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌.. అర్హులైన ప్రతీ ఒక్కరికి రుణమాఫీ అందుతుందని, మండల వ్యవసాయాధికారులకు వివరాలను అందజేయాలని సూచించారు. నిజామాబాద్‌ జిల్లా ఆలూర్‌ మండలం దేగాం గ్రామ దక్కన్‌ గ్రామీణ బ్యాంకు ఎదుట రైతులు సోమవారం ధర్నా చేశారు.


ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్‌ గ్రామంలో గల గ్రామీణ బ్యాంక్‌ ఎదుట రైతులు ఆందోళన చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవుపేట గ్రామంలో రైతు సమన్వయ సమితి నాయకులు సోమవారం రిలే దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరానికి వచ్చిన తహసీల్దార్‌, ఏవో లావణ్య రైతులతో మాట్లాడారు. అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పి రైతులకు ఏవో లావణ్య రాఖీ కట్టి దీక్షను విరమింపజేయించారు.


  • త్వరలో అందరికీ రుణ మాఫీ

కమర్షియల్‌ బ్యాంక్‌లో రుణం తీసుకున్న రైతులకు మాఫీ అవుతుంది. కానీ రైతు సేవా సహకార బ్యాంక్‌లో రుణం తీసుకున్నవారికి ఇప్పటి వరకు మాఫీ కాలేదు. రుణం తీసుకున్న రైతుల వివరాలు అఫ్‌లైన్‌ సిస్టంలో ఉం డటం వల్ల కొంత అలస్యమైంది. అధికారులు ఆడిట్‌ పూర్తి చేసి అన్‌లైన్‌లో పొందుపరిచారు. నాలుగైదు రోజుల్లో రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది

-ఎం.ఎ బాసిత్‌, ఘట్‌కేసర్‌ మండల వ్యవసాయ అధికారి

Updated Date - Aug 20 , 2024 | 03:10 AM