Share News

Krishna River: పోటీలు పడి శ్రీశైలం ఖాళీ

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:28 AM

తాగు, సాగునీటి అవసరాల్లేకుండా జలాలను తరలించరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు సూచించినా ఫలితం లేకుండా పోయింది.

Krishna River: పోటీలు పడి శ్రీశైలం ఖాళీ

  • కృష్ణా బోర్డు మాట వినని తెలుగు రాష్ట్రాలు

తాగు, సాగునీటి అవసరాల్లేకుండా జలాలను తరలించరాదని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. కృష్ణాబోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ ద్వారా సూచించిన మరుసటి రోజే బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్‌ ఉత్పాదనతో 19,820 క్యూసెక్కులను తెలుగు రాష్ట్రాలు పోటీపడి తరలించాయి. మరో 16 వేల క్యూసెక్కుల దాకా ఏపీ.. పోతిరెడ్డిపాడు నుంచి తరలించింది. ప్రస్తుతం పెన్నా బేసిన్‌లో జలాశయాలన్నీ నిండుగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం శ్రీశైలంలో నిల్వలు కొనసాగించాలనే సూచనలను తెలుగు రాష్ట్రాలు పక్కనపెడుతున్నాయి. దాంతో శ్రీశైలంలో నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.


బుధవారం ఈ ప్రాజెక్టుకు 8895 క్యూసెక్కుల వరద రాగా... 38 వేల క్యూసెక్కులు జలాశయం నుంచి మాయమయ్యాయి. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ఇందులో 182.99 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వాస్తవానికి అల్మట్టి నుంచి ఔట్‌ఫ్లో ఉంటేనే శ్రీశైలంలో జలవిద్యుత్‌ ఉత్పాదన చేయాలి. ప్రస్తుతం అల్మట్టి నుంచి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లోలు లేవు. అయినా తెలుగు రాష్ట్రాలు పోటీపడి ఖాళీ చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - Nov 07 , 2024 | 03:28 AM