Rice Seeds: ఫోన్‌చేస్తే చాలు.. రైతు ఇంటికే వరి విత్తనాలు!
ABN , Publish Date - Nov 30 , 2024 | 03:26 AM
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఆహార పదార్ధాలు ఇంటికే వచ్చినట్లుగా.. ఫోన్ చేస్తే చాలు రైతుల ఇంటికే వరి విత్తనాలు పంపించే వినూత్న సేవలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది.
15 కిలోల విత్తన బస్తా ధర రూ.700
25 కిలోల బస్తాకు రూ.995
రవాణా చార్జీలు లేకుండానే సరఫరా
రైతులే వచ్చి కొంటే 6శాతం రాయితీ
విత్తనాభివృద్ధి సంస్థ వినూత్న సేవలు
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఆహార పదార్ధాలు ఇంటికే వచ్చినట్లుగా.. ఫోన్ చేస్తే చాలు రైతుల ఇంటికే వరి విత్తనాలు పంపించే వినూత్న సేవలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. యాసంగి సీజన్‌లో 2.5 లక్షల ఎకరాలకు సరిపడా 50 వేల క్వింటాళ్ల నాణ్యమైన వరి విత్తనాలు సరఫరా చేయాలనే లక్ష్యం విధించుకున్న విత్తనాభివృద్ధి సంస్థ.. రకరకాల మార్గాల ద్వారా రైతులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి రవాణా చార్జీలు లేకుండా.. రైతుల ఇంటివద్దకే విత్తనాలు పంపించాలని నిర్ణయించింది. యాసంగి పంటకాలంలో రైతుల నుంచి గిరాకీ ఎక్కువగా ఉన్న తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్- 15048), కూనారం సన్నాలు (కేఎన్‌ఎం- 163), జగిత్యాల సన్నాలు (జేజీఎల్- 27356)తోపాటు.. దొడ్డు రకాలైన కేఎన్‌ఎం- 118, జేజీఎల్- 4423, ఎంటీయూ- 1010, ఆర్‌ఎన్‌ఆర్- 29325.. ఇలా ఏడు రకాల వరి విత్తనాలను సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 10 కిలోల విత్తన బస్తా రూ.900 ఉండగా.. విత్తనాభివృద్ధి సంస్థ 15 కిలోల బస్తాకు రూ.700, 25 కిలోల బస్తాకు రూ.995 చొప్పున ధర నిర్ణయించడం విశేషం. ప్రైవేటు విత్తన వ్యాపారులతో పోలిస్తే తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వే్‌షరెడ్డి తెలిపారు.
సీడ్ కార్పొరేషన్ పరిధిలో నిజామాబాద్, వరంగల్, జీడిమెట్ల, నిర్మల్, కరీంనగర్, వనపర్తి, నందిపహాడ్, జోగిపేట,ఖమ్మంలో 9 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వీటితోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో కూడా విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలవారీగా కలెక్టర్ కార్యాలయాల్లో వ్యవసాయ, సహకార, ఏఆర్‌ఎ్‌సకేలతో సమావేశాలు నిర్వహించి విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు మరింత చేరువ కావటానికి... బ్రోచర్లు, కరపత్రాల్లో ప్రాంతీయ మేనేజర్ల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. రైతులు ప్రాంతీయ మేనేజర్లకు ఫోన్‌చేస్తే...ఇంటికే నేరుగా విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో విత్తనాలు డోర్ డెలివరీ చేసినట్లు, రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సౌకర్యం కల్పించినట్లు అన్వే్‌షరెడ్డి తెలిపారు. రవాణా ఖర్చులు కార్పొరేషన్ భరిస్తుండగా... ప్రాంతీయ కార్యాలయాలకు నేరుగా వచ్చి విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు 6 శాతం రాయితీ కూడా ఇస్తుండటం గమనార్హం.