TG NEWS: ములుగు ఏజెన్సీలో పెద్దపులి టెన్షన్..హడలెత్తిపోతున్న ప్రజలు ...
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:23 AM
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులుగుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ములుగు : పులి సంచారంతో ములుగు జిల్లా రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి గాండ్రింపులు కలకలం రేపాయి. పంబాపురం అటవీప్రాంతంలో ఇవాళ (శుక్రవారం) సాయంత్రం పులి కదలికలు కనిపించాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యం నుంచి తిరిగి ములుగు జిల్లా అడవుల్లోకి పెద్దపులి వచ్చింది. తాడ్వాయి మండలం పంబాపురం అటవీప్రాంతంలో గిరిజనుడు పులిని చూశాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రల ఆధారంగా పులి తిరిగి వచ్చినట్లుగా అధికారులు నిర్థారించుకున్నారు. జనావాసాలకు వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. అటవీ సమీపంలోని పంటపొలాలకు, పశువులు మేపడానికి, అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. దీంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు.
అటు వైపు వెల్లొద్దు.. అధికారులు హెచ్చరికలు
కాగా ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దపులి సచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తొలుత వెంకటాపురం మండలం, బోదాపురం, ఆలుబాక శివార్లలో రైతులు పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు. తర్వాత గోదావరి దాటి ఇవతలి వైపు మంగపేట మండలంలోకి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో గ్రామాల్లో మినీ మైకుల ద్వారా అధికారులు దండోరా వేయించారు. మంగపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిలో చేపలవేటకు, పశువుల మేతకు అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బోధాపురం సమీపంలో...
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక బోధాపురం సమీపంలో పెద్దపులి కలకలం సృష్టించింది. మిర్చి తోటలకు వెళ్లే దారిలోని గోదావరి పాయలో కొందరు స్థానికులు పెద్దపులి అడుగులను గుర్తించారు. భయపడిపోయి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అలుబాక బోధాపురం శివారులోని అడుగులను పరిశీలించారు. అవి పెద్దపులి అడుగులేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. గోదావరి తీర ప్రాంతంలో కొంతమంది రైతులు పుచ్చతోటలు సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి తోటల వద్ద పడుకున్న సమయంలో పెద్ద పులి అరుపులు వినిపించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
అధికారుల ఆరా..
వెంకటాపురం మండలం అలుబాక శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి అడుగులను బట్టి.. అది ఎటువైపు వెళ్లి ఉంటుందోనని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపులి ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనావాసాల్లోకి పులి ప్రవేశిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో పులి ఆచూకీకి కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలా పెద్దపులి సంచారం తరచూ కలకలం రేపుతుండగా.. ఇప్పుడు మరోసారి అదే భయం జనాలకు పట్టుకుంది. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అధికారులు పశువుల కాపరులతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి అడుగు జాడలతో పాటు ఇతర ఏ సమాచారం ఉన్నా.. వెంటనే తమకు చేరవేయాల్సిందిగా స్థానికులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
For More Telangana News and Telugu News..