STUDENTS: విద్యార్థులతో ఆర్టీసీ చెలగాటం..!
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:09 AM
ఆలస్యానికి మారుపేరుగా మారిన ఆర్టీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. డొక్కు బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియక విద్యార్థులు నిత్యం భయాందోళనలతో ప్రయాణం చేస్తున్నారు.

మధ్యలో ఆగిపోతున్న డొక్కు బస్సులు
ఆందోళన చెందుతున్న విద్యార్థులు
విడపనకల్లు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆలస్యానికి మారుపేరుగా మారిన ఆర్టీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. డొక్కు బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియక విద్యార్థులు నిత్యం భయాందోళనలతో ప్రయాణం చేస్తున్నారు. బుధవారం విద్యార్థులు ప్రయాణిస్తున్న బడి బస్సు మధ్యలో ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు గేర్ రాడ్డు విరిగి పోవటంతో హావళిగి గ్రామంలోని బస్టాండ్‌లో నిలిచిపోయింది. ఉదయాన్నే ఇంటర్ విద్యార్థులకు ఉరవకొండలో ప్రాక్టికల్స్ ఉండటంతో ప్రత్యామ్నాయ బస్సు కోసం ఎదురు చూస్తూ ఆందోళన చెందారు. ఉదయం 8 గంటలకు బస్సు నిలిచి పోవటంతో ఉరవకొండకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, డిపోకు ఫోన ద్వారా సమాచారం అందించి మరో బస్సును రప్పించారు. దీంతో విద్యార్థులు అర గంట ఆలస్యంగా ప్రాక్టిల్ పరీక్షలకు హాజరయ్యారు.
కండిషన బస్సులు నడపాలి: ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటే కండిషన ఉన్న బస్సులను నడపాలని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సమయానికి బస్సులు రాక పోయినా, కండీషన లేని బస్సులు మధ్యలో నిలిచిపోయినా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు పరీక్షా సమయంలో విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.