Share News

Ayyanna Patrudu : పర్యాటకంలో 1,217 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:58 AM

సోమవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో ఎనిమిది సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Ayyanna Patrudu : పర్యాటకంలో 1,217 కోట్ల పెట్టుబడులు

  • విశాఖలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు

  • 8 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు

  • అందుబాటులోకి 825 హోటల్‌ గదులు

  • 2,667 మందికి ఉపాధి అవకాశాలు

  • క్రూయిజ్‌ హబ్‌గా విశాఖ: మంత్రి దుర్గేశ్‌

  • పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా

  • ఇతర పరిశ్రమలకు మాదిరిగానే రాయితీలు

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో నోవోటెల్‌లో సోమవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో ఎనిమిది సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా రూ.1,217 కోట్ల పెట్టుబడులు వస్తాయని, వివిధ ప్రాంతాల్లో 825 హోటల్‌ రూమ్‌లు అందుబాటులోకి వస్తాయని, 2,667 మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ, ఎండీ, వీసీ ఆమ్రపాలి వెల్లడించారు. విశాఖపట్నాన్ని క్రూయిజ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, ఎంటర్‌టైన్‌మెంట్‌, టూరిజం రియల్‌ హబ్‌గా నగరం మారనుందని మంత్రి దుర్గేశ్‌ అన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో పర్యాటకులకు 50 వేల గదులు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించిందని, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ వర్తింపజేయనున్నామని చెప్పారు. సింగిల్‌ విండో ద్వారా దరఖాస్తు చేసిన నెల రోజుల్లో అనుమతులు ఇస్తామన్నారు. హోటళ్లలో బార్‌ లైసెన్స్‌ ఫీజు రూ.66 లక్షలు పెట్టడం వల్ల వ్యాపారం జరగడం లేదని రాష్ట్ర హోటలియర్స్‌ అసోసియేషన్‌ తమ దృష్టికి తీసుకువచ్చిందని, ఆ విషయం సీఎం చంద్రబాబుకు వివరించగా, దానిని రూ.20 లక్షలకు తగ్గించడానికి అంగీకరించారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని మంత్రి తెలిపారు.


హోటళ్లను లేట్‌ నైట్‌ వరకు తెరిచి ఉంచేందుకు కూడా అనుమతి ఇవ్వనున్నామని చెప్పారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అరకులోయలో నిర్వహించే ‘అరకు చలి ఫెస్టివల్‌’ పోస్టర్‌ను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఒప్పందాలన్నీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సమక్షంలో జరిగాయి. కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగ మాధవి, పర్యాటక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, 150 మందివరకు పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

టూరిజంలో ఆశించిన అభివృద్ధి లేదు: స్పీకర్‌ అయ్యన్న

రాష్ట్రంలో పర్యాటక రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని, లోపాలను సరిదిద్దుకొని, సానుకూల దృక్పథంతో పెట్టుబడిదారులకు సహకరించాలని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన అతిథిగా వచ్చారు. అద్భుతమైన విశాఖపట్నం దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాల స్థాయిలో అభివృద్ధి చెందడం లేదన్నారు. అంతా గోవా ఎందుకు వెళుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. పర్యాటకులు ఆశించేవి అందించినప్పుడే ఆదరణ లభిస్తుందన్నారు. లంబసింగికి రోజూ వేలాది మంది పర్యాటకులు వస్తున్నారని, వారికి సరైన వసతి, భోజనం, బస లేవన్నారు. ఏజెన్సీలో 1/70 చట్టం వల్ల ఇతరులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. కర్ణాటకలోని కూర్గ్‌లో కూడా ఏజెన్సీయేనని, మరి అక్కడ పెట్టుబడులు ఎలా సాధ్యమయ్యాయో అధికారులు తెలుసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:59 AM