Share News

Funding : రాష్ట్రానికి కేంద్రం దన్ను

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:08 AM

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయింపులు చేసింది. విశాఖ ఉక్కుకి కూడా నిధులు సమకూర్చింది.

 Funding : రాష్ట్రానికి కేంద్రం దన్ను

  • రాజధానికి ఈ ఏడాదే 15 వేల కోట్లు.. రానున్న కాలంలో మరింతగా సాయం

  • విశాఖ ఉక్కుకు 3,295 కోట్లు.. 11,921 కోట్ల ప్యాకేజీలో భాగంగా నిధులు

  • పోలవరానికి 5,936 కోట్లు.. ప్రాజెక్టు తొలి దశ అంచనా 30,436 కోట్లు

  • పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా రూ.57,566 కోట్లు

  • విభజన హామీల అమలుపై మాట నిలబెట్టుకున్న కేంద్రం

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన హా మీలకు సంబంధించి కేంద్రం తాజా బడ్జెట్‌లో మాట నిలబెట్టుకుంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయింపులు చేసింది. విశాఖ ఉక్కుకి కూడా నిధులు సమకూర్చింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేర్చేందుకు, పోలవరాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించింది. అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.15 వేల కోట్లు సమకూరుస్తామని వెల్లడించింది. రానున్న సంవత్సరాల్లో రాజధానికి మరిన్ని నిధులు సమకూరుస్తామంది. విదేశీ సా యం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులను సంప్రదించామని, ఈ రెండు సంస్థలతో లీగల్‌ ఒప్పందాలపై డిసెంబరు 20, 26 తేదీల్లో సంతకాలు కూడా జరిగాయని వివరించింది. సవరించిన అంచనాల ప్రకారం.. పోలవరం తొలి దశ పూర్తవడానికి రూ.30,436. 95 కోట్ల వ్యయమవుతుందని.. ఇందులో ఇప్పటికే రీయింబర్స్‌ చేసిన మొత్తం పోగా.. మరో రూ.12,157.36 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. దీనిలో ఈ ఏడాది రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో ప్రధాన డ్యాం పనులు, కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించి కొత్త ఆయకట్టు అభివృద్ధికి, ప్రస్తుత ఆయకట్టు స్థిరీకరణకు వీలు కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇటీవలే కేంద్రం రూ.11,921 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. దీనిలో భాగం గా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈక్విటీ వాటా మూలధనం కింద రూ.3,295 కోట్లు కేటాయించింది(ఇందులో బడ్జెటరీ మద్దతు రూ.2,955 కోట్లు, అంతర్గత అదనపు బడ్జెటరీ రూ.300 కోట్లు). 2024-25లో ఈ కర్మాగారానికి రూ.8,622 కోట్లు కేటాయించారు. విభజన హామీల్లో 2024నాటికి ఎన్ని నెరవేర్చారో కూడా బడ్జెట్‌ పత్రాల్లో వివరించారు.

35,491 కోట్ల ప్రత్యేక గ్రాంటు

2024 డిసెంబరు 24 నాటికి రాష్ట్రానికి రూ.3,950.31 కోట్ల మేరకు మూలధన వ్యయాన్ని ఆమోదించామని కేంద్రం తెలిపింది. ప్రత్యేక సాయం కింద రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. 2015 జూన్‌ నుంచి గత డిసెంబరు వరకూ విభజన చట్టం కింద రాష్ట్రానికి రూ.35,491.57 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరు చేశామంది.

పూర్వోదయ ప్రాజెక్టు క్రింద విజన్‌ పత్రాలను రూపొందించాలని ఏపీ, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. స్థూల ప్రణాళికలకు అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొంది.

విభజన చట్టంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇప్పటికే రూ.1,750 కోట్లు విడుదల చేయగా మరో రూ.350 కోట్లు ఇవ్వాల్సి ఉందని.. యూసీల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

రాష్ట్రంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ), సెంట్రల్‌ యూనివర్సిటీ, గిరిజన వర్సిటీకి నిధులు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద మంగళగిరి ఎయిమ్స్‌కు కూడా నిధులు మంజూరు చేశారు.


పన్నుల్లో వాటా రూ.57,566.31 కోట్లు

2025-26లో ఏపీకి మొత్తం పన్నుల్లో 4.067 శాతం.. అంటే రూ.57,566.31 కోట్లు లభిస్తుందని కేంద్ర బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నారు. ఇందులో కార్పొరేషన టాక్స్‌ రూపంలో రూ.16,074.48 కోట్లు, ఆదాయ పన్ను రూపంలో రూ.21,448.05 కోట్లు, కేంద్ర జీఎస్టీ 16,759.03 కోట్లు, కస్టమ్స్‌ సుంకం రూ.2,649.66 కోట్లు, ఎక్సైజ్‌ సుంకం రూపంలో రూ. 550.47 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.1.66 కోట్లు లభిస్తాయని తెలిపారు.

Updated Date - Feb 02 , 2025 | 03:08 AM