Share News

Commercial Tax Dept : పల్నాడులో గ్రానైట్‌ అక్రమ రవాణా

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:06 AM

వాణిజ్య పన్నుల శాఖకు చాలా నెలల తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చి పల్నాడు జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.

 Commercial Tax Dept :  పల్నాడులో గ్రానైట్‌ అక్రమ రవాణా

  • 14 లారీలు స్వాధీనం, జరిమానా.. గుట్టుగా సాగుతున్న చీకటి దందా

నరసరావుపేట, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖకు చాలా నెలల తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు రోడ్లపైకి వచ్చి పల్నాడు జిల్లాలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. శనివారం నరసరావుపేట, నకరికల్లు అడ్డరోడ్డు, పిడుగురాళ్ల ప్రాంతాల్లో అక్రమంగా గ్రానైట్‌ రవాణా చేస్తున్న 14 లారీలను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సదరు శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన ఒక్కొక్క లారీకి రూ.లక్ష జరిమానా విధించారు. పల్నాడు జిల్లా కేంద్రంగా గ్రానైట్‌ అక్రమ రవాణా గుట్టుగా సాగుతోంది. రాత్రి సమయాల్లో పెద్దయెత్తున గ్రానైట్‌ లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నాయి. అడ్డుకునే వారు ఉండరు.. వే బిల్లులు ఉండవు. ప్రభుత్వానికి రూపాయి కూడా పన్ను చెల్లించకుండా గ్రానైట్‌ను జిల్లా మీదుగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అదాయానికి కోట్లల్లో గండి పడుతోంది. కొందరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ చీకటి వ్యాపారం జరుగుతుండడంతో.. అధికారులు చర్యలు తీసుకొనే సాహసం చేయలేని దుస్థితి.

  • ఇతర రాష్ట్రాలకు వయా పల్నాడు

చిలకలూరిపేట, నరసరావుపేట, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, చీమకుర్తి, బల్లికురవ మండలాల పరిధిలో గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్నాయి. పల్నాడు జిల్లా గుండా ప్రతిరోజూ పెద్దఎత్తున గ్రానైట్‌ను తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు సరిహద్దులు దాటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా సాగుతోంది. నరసరావుపేట, సంతమాగులూరు, చిలకలూరిపేట ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి గ్రానైట్‌ లారీలు పిడుగురాళ్ల, దాచేపల్లి మీదుగా తెలంగాణాలోకి ప్రవేశిస్తున్నాయి. అవసరమైన అన్ని ఏర్పాట్లను అక్రమార్కులు చేస్తున్నారు. గ్రానైట్‌ రవాణా చేయాలంటే వే బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది. లారీకి రూ.లక్షకు పైగా పన్ను చెల్లించాలి. అక్రమార్కులు కోరిన విధంగా రూ.38 వేలు చెల్లిస్తే ఈ పన్ను చెల్లించకుండానే సరిహద్దులు దాటిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2025 | 06:07 AM