AP Governor Abdul Nazeer : ఆకలితో ఏ కుటుంబమూ నిద్రపోకూడదు
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:05 AM
10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.

అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం
10 సూత్రాల అమలుతో లక్ష్యాల సాధన
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఊతం
2026 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి
స్వర్ణాంధ్ర సాకారానికి 15% వృద్ధిరేటు
2047నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది
ఏపీ బ్రాండ్ విలువను తిరిగి తీసుకొస్తాం
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని వివరించారు. ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు నిధులు సమకూర్చిందన్నారు. అమరావతిలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభించేందుకు సహకారం అందించిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా కృషి చేసినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యంగా తమ ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ప్రధాని కలలు కన్న వికసిత్ భారత్ లక్ష్యాలు సాధించే దిశగా నడుస్తున్నామన్నారు.
సాగు కొత్తపుంతలు..
‘ప్రతి ఇంటికి, పొలాలకు, పరిశ్రమలకు నీరు అందించడంతో పాటు అగ్రిటెక్ విధానం ద్వారా వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. నూతన జల విధానం ద్వారా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2026 డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా 2026 జూన్ కల్లా నీటిపారుదల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాం. గోదావరి నది నుంచి వరద నీటిని బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా రాయలసీమలో వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించేందుకు చర్యలు చేపడతాం’ అని గవర్నర్ అన్నారు.
అభివృద్ధి.. వసతులు
‘స్వచ్ఛాంధ్ర ద్వారా పరిశుభ్రత, పచ్చదనం కల్పిస్తాం. ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రాన్ని అవకాశాల కేంద్రంగా మారుస్తాం. ఉద్యోగార్థులను సైతం ఉద్యోగాలు కల్పించేవారిగా తీర్చిదిద్దుతాం. విద్యా సంస్థల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యువతకు రేపటి అవకాశాల కేంద్రాలుగా మారుతాయి. రాష్ట్రంలో జననాల రేటు తగ్గిపోతోంది. రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచనుంది. మెగాపోర్టులు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, వివిధ తరహా రవాణాలను అందుబాటులోకి తెస్తాం. విద్యుత్ కొరత లేకుండా సౌర, పవన, హైడ్రో విధానం ద్వారా ఉత్పత్తి చేపడుతున్నాం. పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రోడ్లు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు లింకు రోడ్లు, పట్టణాలకు కనెక్టివిటీ పెంచుతున్నాం. వ్యర్థాల నిర్వహణ చర్యలతో పాటు చెత్త నుంచి విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టాం’ అని పేర్కొన్నారు.
నేరాలపై ఉక్కుపాదం
‘రాష్ట్రంలో నేర నియంత్రణకు చర్యలు చేపట్టాం. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం ద్వారా నేరాలు తగ్గాయి. రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో ప్రభుత్వం నేరుగా ప్రజలతో మమేకమవుతోంది. సంఘ వ్యతిరేకశక్తులు, డ్రగ్స్, గంజాయి, మహిళలపై అఘాయిత్యాలు వంటి వాటిపై ఉక్కుపాదం మోపాం. ఎక్సైజ్ పాలసీలో పారదర్శకత తీసుకొచ్చాం. వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ప్రజలకు స్మార్ట్‌ఫోన్ ద్వారా సర్వీసులు అందించే చర్యలు తీసుకుంటున్నాం. వాట్సాప్ ద్వారా 150 రకాల సర్వీసులు అందిస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో సమష్టి ప్రయత్నాలతో వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని ఆశిస్తున్నాం. 2047 కల్లా దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 22 కొత్త పాలసీలను తీసుకొచ్చింది. స్వర్ణాంధ్ర సాధన ప్రయత్నంలో 15 శాతం వృద్ధిరేటు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తుంది. ఏపీ బ్రాండ్ విలువను తిరిగి తీసుకొస్తాం. ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆ మేరకు ప్రయత్నాలు చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. తద్వారా ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలి’ అని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తులను ప్రస్తావించారు.
ఆకట్టుకున్న శకటాలు
గణతంత్ర వేడుకల్లో వివిధ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ప్రణాళిక శాఖలు, గృహ నిర్మాణం, పరిశ్రమలు, పర్యాటక, సమగ్రశిక్ష, పాఠశాల విద్య, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, జలవనరులు, రైతు సాధికార సంస్థ, మత్స్య, సీఆర్‌డీఏ, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిశాఖ పల్లె పండుగ, ఇంధన, ఉద్యాన శాఖలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రియల్‌టైమ్ గవర్నెన్స్ శకటాలను ప్రదర్శించారు. నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి శకటం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్ ఉద్యాన శాఖ శకటం, గ్లోబల్-బెస్ట్ లాజిస్టిక్స్ సీఆర్‌డీఏ/మున్సిపల్ శాఖ శకటాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గవర్నర్ నుంచి ఆయా శాఖల అధికారులు అవార్డులు స్వీకరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి భవిష్యత్తు దార్శనికతపై ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలను నగర ప్రజలు తిలకించేందుకు వేడుకల అనంతరం బెంజ్‌సర్కిల్, రామవరప్పాడు రింగ్, గుణదల, ఏలూరు రోడ్డు, కంట్రోల్‌రూం, బందర్‌రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా ప్రదర్శన నిర్వహించారు.
నేతల రాకతో కేరింతలు
గణతంత్ర వేడుకల్లో చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా, మంత్రులు, అధికారులు, నేతలు పాల్గొన్నారు. బాబు, పవన్, లోకేశ్ స్టేడియంలోకి ప్రవేశించేటప్పుడు యువత, విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల