School Enrollments : బడులను ముంచిన జగన్ మామ
ABN , Publish Date - Feb 10 , 2025 | 03:59 AM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బడులకు మెరుగులు దిద్దేలా పథకాలు అమలు చేస్తుంది.

ఐదేళ్ల పాలనలో సర్కారీ స్కూళ్లు నిర్వీర్యం!
ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు
సాధ్యంకాని సంస్కరణలతో అస్తవ్యస్తం.. ప్రైవేటుకు మేలు చేసేలా తరగతుల విలీనం
ఊరి బడిని దూరం చేసి లేనిపోని గొప్పలు.. బలవంతంగా ఇంగ్లిష్ మీడియం రుద్దుడు
టోఫెల్, ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు.. ఇప్పటికీ గత ప్రభుత్వ చర్యల ప్రభావం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదలు చదువుకునే సర్కారీ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బడులకు మెరుగులు దిద్దేలా పథకాలు అమలు చేస్తుంది. కానీ పిల్లలకు మేనమామనంటూ చెప్పుకొన్న జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారు.. బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత ఐదేళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది. అప్పటి వరకు ప్రైవేటు బడులకు పిల్లల్ని పంపాలనే ఆలోచన తల్లిదండ్రులకు లేకపోయినా, బలవంతంగా ప్రైవేటు బాట పట్టేలా వారి ఆలోచనను మార్చేసింది. ప్రభుత్వ బడుల్లో చదివితే కష్టం అనే పరిస్థితి తీసుకొచ్చింది. విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు క్యూ కట్టేలా చేసింది. చివరికి ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూర్చింది. మధ్యలో కొవిడ్ సమయంలో ప్రభుత్వ బడుల్లో భారీగా విద్యార్థులు పెరిగినా.. వారిని అక్కడే కొనసాగించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడులు అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది.
తొలి నుంచీ ప్రయోగాలే
జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రయోగశాలగా మార్చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఏం అనిపిస్తే అది అమలు చేసి బడులను భ్రష్టు పట్టించారు. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ వెంటనే కొవిడ్ రావడంతో ప్రైవేటు బడుల విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కానీ ఆ తర్వాత తీసుకొచ్చిన జీవో 117 ప్రాథమిక విద్యను తీవ్రంగా దెబ్బతీసింది. గ్రామాల్లోని అనేక బడులు మూత పడేందుకు కారణమైంది. జగన్ ప్రభుత్వం తరగతులను విలీనం చేసి ప్రాథమిక విద్యను తీవ్రస్థాయిలో దెబ్బతీసింది. 4,250 పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది. ఈ ఒక్క దెబ్బతో విద్యార్థులు మరో ప్రభుత్వ బడికి కాకుండా సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. అలాగే జీవో 117 ప్రకారం బోధనను రెండుగా వర్గీకరించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమికోన్నత పాఠశాలలపై ప్రయోగం చేసింది. విద్యార్థుల సంఖ్య 92 లేని ప్రాథమికోన్నత పాఠశాలల్లో మొత్తం సెకండరీ గ్రేడ్ టీచర్లను కేటాయించింది. 92 కంటే ఎక్కువ ఉంటే అక్కడ మొత్తం స్కూల్ అసిస్టెంట్లను ఇచ్చింది. అంటే.. సంఖ్యపై అక్కడి విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడేలా చేసింది. వాస్తవానికి 6వ తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్లతో బోధన జరుగుతుంది. కానీ 3 నుంచే స్కూల్ అసిస్టెంట్లతో బోధన అంటూ ప్రకటించి, విద్యార్థుల సంఖ్యతో ముడిపెట్టి 6 నుంచి 8 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్లను లేకుండా చేసింది. దీంతో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు రకాల విద్యా బోధనలు అమల్లోకి వచ్చాయి.
సంస్కరణల పేరిట గందరగోళం
రెండేళ్లలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సీబీఎ్‌సఈ సిలబ్‌సలోకి మార్చేస్తామని ప్రకటించిన జగన్.. ఐదేళ్లలో వెయ్యి పాఠశాలలను మాత్రమే మార్చగలిగారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు అసలు ఎక్కడుందో తెలియని ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ)ని తెరపైకి తెచ్చారు. ఇక మొత్తం ఐబీ సిలబస్ అంటూ కొంతకాలం ఊదరగొట్టారు. తీరా చూస్తే ఐబీ సిలబస్ దేశం మొత్తంలో వెయ్యి పాఠశాలల్లో కూడా లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని ఐబీలోకి మారుస్తూ, 2035 నాటికి ఐబీ సిలబ్‌సలో టెన్త్ పరీక్షలు జరుగుతాయంటూ ఐబీతో ఒప్పందం కూడా చేసుకున్నారు. మరోవైపు ఉన్నత విద్య అనంతరం విదేశాలకు వెళ్లేవారికి అవసరమైన టోఫెల్‌ను పాఠశాలల్లో ప్రారంభించారు. ఇంగ్లిష్ టీచర్లు బోధించాల్సిన టోఫెల్‌ను సైన్స్, సోషల్ టీచర్లు బోధించేలా అస్తవ్యస్త విధానాలు అమలు చేశారు. దీంతో అసలు ప్రభుత్వ పాఠశాలు ఏ దిశలో వెళ్తున్నాయనే ఆందోళన మొదలైంది. ఫలితంగా ప్రభుత్వ బడుల నుంచి తమ పిల్లలను తల్లిదండ్రులు క్రమంగా ప్రైవేటుకు పంపారు.
కరోనా సమయంలో పెరిగినా...
గత తెలుగుదేశం ప్రభుత్వంలో చివరి విద్యా సంవత్సరం 2018-19లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 39,29,019 మంది విద్యార్థులుంటే, 2024-25 విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34,50,423కు పడిపోయింది. అంటే.. వైసీపీ హయాంలో 4,78,596 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌లు, వైరస్ ప్రభావం వల్ల ఫీజులు వృథా చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో తల్లిదండ్రులు లక్షల మంది విద్యార్థులను ప్రైవేటు బడులు మాన్పించి, ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. దీంతో 2020-21లో విద్యార్థుల సంఖ్య 43,42,874కు పెరిగింది. ఆ తర్వాత 2021-22లో ఆ సంఖ్య 44,29,569కు చేరింది. కానీ కొవిడ్ తగ్గిన వెంటనే ప్రైవేటు నుంచి వచ్చిన విద్యార్థులంతా వెనుదిరిగారు. దీంతో విద్యార్థుల సంఖ్య 2022-23లో 39,95,992కు, 2023-24లో 35,69,506కు పడిపోయింది. గతంలో ప్రభుత్వ బడుల్లో ఉన్న విద్యార్థులు కూడా భారీగా ప్రైవేటు బాట పట్టారు.
ప్రైవేటుతో సమాన స్థాయికి..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదివేవారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో క్రమంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రైవేటు బడులు బలోపేతం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో దాదాపుగా సమాన స్థాయికి వచ్చారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, సంక్షేమ, ఎయిడెడ్ అన్ని రకాల ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో కలిపి ప్రస్తుతం 34,50,423 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 33,99,832 మంది ఉన్నారు. 50 వేలమంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఎక్కువగా ఉన్నారు. గతంలో ఈ వ్యత్యాసం ఏడెనిమిది లక్షలు ఉండేది. కానీ టీచర్లు మాత్రం ప్రభుత్వం స్కూళ్లలో 1,84,860 మంది ఉంటే, ప్రైవేటు పాఠశాలల్లో 1,24,827 మంది మాత్రమే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో 60 వేలమంది టీచర్లు తక్కువగా ఉన్నా తల్లిదండ్రులు అటు వైపే మొగ్గు చూపుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి