Revenue Department : రీ సర్వే రచ్చ
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:56 AM
ప్రభుత్వ శాఖలు పరిష్కరించాల్సిన అంశాలు. అంటే... మొత్తం 7,42,301 సమస్యల్లో సగం ఒక్క రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నమాట.

కూటమి సర్కారు నెత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు
8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు
రెవెన్యూ శాఖవే 3.39 లక్షలు
ఇవన్నీ రీ సర్వేతో వచ్చిన సమస్యలే
అధికారులు, సిబ్బంది కొరతతో నేడు సంక్లిష్టంగా పరిష్కారం
జగన్ సర్కారు దిగిపోయినా ఆయన చేసిన తప్పిదాలు ఇప్పటికీ రైతులను వెంటాడుతున్నాయి. వందలో, వేలో కాదు.. లక్షలాది మంది తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అధికారిక లెక్కల ప్రకారం 7,42,301 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. అందులోనూ రీ సర్వే పేరిట జగన్ సర్కారు కొత్తగా సృష్టించిన సమస్యలే.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత సర్కారు సృష్టించిన సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటిని క్రోడీకరించగా రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సినవే 3,39,047 ఉన్నాయి. మిగిలినవి ఇతర ప్రభుత్వ శాఖలు పరిష్కరించాల్సిన అంశాలు. అంటే... మొత్తం 7,42,301 సమస్యల్లో సగం ఒక్క రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నమాట. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారం (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం-పీజీఆర్‌ఎ్‌స)పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాఫిర్యాదులు, విన్నపాల్లో ఎక్కువగా జగన్ సర్కారు చేపట్టిన రీ సర్వేపైనే ఉన్నట్టు వెల్లడైంది. పాలకుడు సమర్థుడైతే ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పరిష్కరిస్తారు. అదే పాలకుడు మరిన్ని కొత్త సమస్యలను సృష్టిస్తే ప్రజల జీవితాలు మరింత కష్టాలమయం అవుతాయి. అప్పటికే ఉన్న సమస్యలు తీరక పోగా, కొత్త సమస్యలు చుట్టుముడతాయి. గత జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇదే. జగన్ అధికారంలోకి వచ్చేనాటికి కొన్ని సమస్యలున్నాయి. అందులో భూ వివాదాలు కొన్ని. వాటిని ఆయన పరిష్కరించాల్సింది పోయి భూముల సర్వే పేరిట కొత్తగా ప్రతి ఇంటికో భూ వివాదాన్ని సృష్టించారు.
రీ సర్వే ఉద్దేశం మంచిదే అయినా ఆచరణే చెత్తగా ఉంది. అధికారులు చట్టబద్ధమైన సర్వే చేయలేదు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం ప్రతి దశలో రైతులను భాగస్వాములను చేసి, వారి ఆమోదంతో సర్వే చేపట్టాలి. కానీ రైతుల ప్రమేయం లేకుండానే సర్వే చేసినట్లుగా రికార్డులు తయారు చేశారు. ఆ తప్పులను రైతులపై రుద్దారు. లెక్కలేనన్ని తప్పులను సరిదిద్దడం ఇప్పుడు కూటమి సర్కారు బాధ్యతగా మారింది. గతేడాది జూన్ 15 నుంచి ఈనెల 6 వరకు గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, ప్రజావేదిక, ప్రజాప్రతినిధులు, పార్టీల ఆఫీసులు, మంత్రులు, సీఎంఓకు వచ్చిన ఫిర్యాదులన్నీ దాదాపు 7,42,301. ఇందులో రీ సర్వేతో వచ్చిన సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఫిర్యాదులను క్రోడీకరించగా టాప్-5 జాబితాలో రెవెన్యూ అంశాలే ఉన్నాయి.
రైతులకు కొత్త సమస్యలు
జగన్ ప్రభుత్వం 100ఏళ్ల తర్వాత చరిత్రాత్మకమైన సర్వే చేస్తున్నామంటూ ఆర్భాటం చేసింది. సర్వే సరిహద్దుల చట్టం-1923 ప్రకారం సర్వేకు ముందు రైతుకు నోటీసు ఇవ్వాలి. సర్వే చేసిన తర్వాత మరో నోటీసు ఇచ్చి లిఖితపూర్వకంగా రైతు ఆమోదం తీసుకోవాలి. ఒకవేళ సర్వే రిపోర్టుపై రైతుకు భిన్నాభిప్రాయం ఉంటే మరోసారి సర్వే చేయాలి. లేదంటే రీసర్వే అప్పీల్ డిప్యూటీ తహశీల్దార్ వద్ద పిటిషన్ వేయాలి. ఇవన్నీ చట్టప్రకారం చేయాలి. కానీ జగన్ సర్కారు అధికార యంత్రాంగాన్ని తొందరపెట్టింది. ఈ ప్రాజెక్టు పేరు చెప్పి ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావించి త్వరగా రీ సర్వేను ముగించాలని ఒత్తిడి చేసింది. ఫలితంగా అధికారులు నిబంధనలు పాటించకుండా రీ సర్వే రికార్డులు తయారు చేశారు. దీంతో రైతుల భూముల విస్తీర్ణం, సరిహద్దుల్లో తేడాలు వచ్చాయి. పాసుపుస్తకాల్లో పేర్లు, సర్వే నంబర్, సరిహద్దుల్లో తేడాలు వచ్చాయి. వాటిని పరిష్కరించాల్సిన రెవెన్యూ, సర్వే అధికారులు చేష్టలుడిగిపోయారు. జగన్ ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా రీ సర్వే అద్భుతంగా సాగుతోందని, రంగురంగుల చిత్రాలు, గ్రాఫిక్స్‌తో కూడిన తప్పుడు నివేదికలు ఇచ్చారు. రీ సర్వేలో లోపాలు, తప్పులున్నాయని ఎత్తిచూపొద్దని, ప్రభుత్వానికి నివేదించొద్దని కలెక్టర్, జేసీ, సర్వే, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేశారు. లక్షల మంది రైతులు ఇబ్బందులకు కారకుడైన ఓ అధికారి సర్వే నుంచి తప్పుకొని చల్లగా రాష్ట్రం నుంచి జారుకున్నారు.
ఇప్పుడైనా చిత్తశుద్ధిగా పనిచేస్తారా?
జగన్ సర్కారు రాష్ట్రంలో 17,600 గ్రామాలకు గాను 8,680 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసింది. ఆ గ్రామాల్లోనే లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇన్ని సమస్యలకు కారణమైంది రెవెన్యూ శాఖనే. ఇప్పుడు రైతుల ఫిర్యాదులను పరిష్కరించాల్సింది కూడా అదే శాఖనే. గతంలో జరిగిన తప్పులకు అధికారులపై ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడయినా అధికారులు చిత్తశుద్ధితో రైతుల ఫిర్యాదులు పరిష్కరిస్తారా? లేక కాగితాల్లోనే పరిష్కారం చూపిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లక్షల్లో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నట్లుగా సిబ్బంది చెబుతున్నారు. వేగంగా పరిష్కరించేంత సిబ్బంది ఇప్పుడు రెవెన్యూ శాఖ వద్ద లేరు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్‌ఐ, ఇతర సిబ్బంది కొరత భారీగా ఉంది. కాబట్టి సమస్య పరిష్కారమే అజెండాగా దిశానిర్దేశం చేయాలని, టార్గెట్‌లు పెడితే మళ్లీ కాగితాలపై పరిష్కారం చూపే ప్రమాదం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.