Amarnath Reddy: నేను ఏ విచారణకు రాను.. భూకబ్జాలపై వైసీపీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:27 PM
Amarnath Reddy: ‘‘ నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నేను ఎలాంటి విచారణకు హాజరుకాను’’ అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. భూకబ్జాలపై స్పందించిన ఎమ్మెల్యే.. తాను ఏ భూములను ఆక్రమించలేదని చెప్పుకొచ్చారు.

కడప, ఫిబ్రవరి 22: భూకబ్జాలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (YSRCP MLA Akepati Amarnath Reddy) స్పందించారు. ‘‘నేను నా కుటుంబం ఎలాంటి భూములు ఆక్రమించలేదు.. ఆక్రమించినట్లు గుర్తిస్తే ఆ భూముల ప్రభుత్వం తీసుకోవచ్చు. మా గ్రామంలో నేను నా కుటుంబం ఇళ్ళు కట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులు నాకు అందలేదు.. నేను ఎలాంటి విచారణకు హాజరుకాను.. నాపై ఆరోపణలు ఇప్పటివి కావు. కడప పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ కూడా ఆరోపించారు. నేను భూముల ఆక్రమించి ఉంటే తీసుకోమని ఏనాడో చెప్పాను’’ అంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మెడకు భూకబ్జాల వివాదం చుట్టుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వం భూములను ఆక్రమించి ఆకేపాటి ఎస్టేట్‌పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu Naidu) రాజంపేట టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బనర్సయ్య నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి భూకబ్జాలకు పాల్పడి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను సీఎంవో ఆదేశించింది. దీంతో కలెక్టర్ శ్రీధర్ విచారణ బాధ్యతలను రాజంపేట సబ్ కలెక్టర్‌కు అప్పగించగా.. ఇటీవలే రెవెన్యూ సర్వే అధికారులు విచారణ పూర్తి చేశారు.
మందపల్లి రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్లలో వందలాది ఎకరాల భూమిని ఎమ్మెల్యే ఆకేపాటి ఆక్రమించుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత నివేదికను రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కలెక్టర్‌కు సమర్పించారు. అమర్నాథ్ రెడ్డి, ఆయన భార్య జ్యోతమ్మ, సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సుజన పేరుతో తప్పుడు రికార్డు సృష్టించి రిజిస్ట్రర్ చేయించుకున్నట్లు తేల్చారు. దీనిపై ఈరోజు (ఫిబ్రవరి 22) విచారణకు రావాలని ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు రాజంపేట మండలం ఎన్టీఆర్ కాలనీలో ఎమ్మెల్యే భూ కబ్జాలపై కలెక్టర్‌కు దళితులు ఫిర్యాదు చేశారు. బీసీలకు ఇచ్చిన కాలనీవాసులను బయటకు పంపించి ఫామ్‌హౌస్ కట్టాడని ఆరోపించారు. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపి ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
Read Latest AP News And Telugu News